మన శరీరానికి నిత్యం అనేక విటమిన్లు, మినరల్స్ అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. వాటి వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. శక్తి అందుతుంది. అలాగే అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వహించబడతాయి. అయితే మినరల్స్ లో మెగ్నిషియం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఇది ఉన్న ఆహారాలను కూడా నిత్యం మనం తీసుకోవాల్సి ఉంటుంది.
మెగ్నిషియం ఉపయోగాలు
మెగ్నిషియం వల్ల మన శరీరం మనం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్లను సరిగ్గా జీర్ణం చేస్తుంది. కండరాలు, నాడులు సరిగ్గా పనిచేస్తాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. డీఎన్ఏకు మేలు జరుగుతుంది.
మెగ్నిషియం ఎంత అవసరం ?
* పుట్టినప్పటి నుంచి 6 నెలల వయస్సు ఉన్న చిన్నారులకు నిత్యం 30 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం.
* 7 నుంచి 12 నెలల వయస్సు ఉన్నవారికి 75 మిల్లీగ్రాములు
* 1 నుంచి 3 ఏళ్ల వారికి 80 మిల్లీగ్రాములు
* 4 – 8 ఏళ్ల వారికి 130 మిల్లీగ్రాములు
* 9 – 13 ఏళ్ల వారికి 240 మిల్లీగ్రాములు
* 14 – 18 ఏళ్ల వారికి, బాలురు – 410 మిల్లీగ్రాములు, బాలికలు – 360 మిల్లీగ్రాములు
* 19 నుంచి 30 ఏళ్ల వారికి, బాలురు – 400 మిల్లీగ్రాములు, బాలికలు – 310 మిల్లీగ్రాములు
* 31 – 50 ఏళ్ల వారికి, పురుషులు – 420 మిల్లీగ్రాములు, స్త్రీలు – 320 మిల్లీగ్రాములు
* 51 ఏళ్లకు పైబడిన వారికి, పురుషులు – 420 మిల్లీగ్రాములు, స్త్రీలు – 320 మిల్లీగ్రాములు
* గర్భంతో ఉన్నవారికి నిత్యం 350 నుంచి 400 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం.
* పాలిచ్చే తల్లులకు 310 నుంచి 360 మిల్లీగ్రాముల మెగ్నిషయం సరిపోతుంది.
మెగ్నిషియం లోపం లక్షణాలు
మన శరీరంలో మెగ్నిషియం లోపిస్తే ఆకలి బాగా తగ్గుతుంది. లేదా ఆకలి అస్సలే ఉండదు. వికారంగా అనిపిస్తుంది. వాంతులు అవుతాయి. తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. చేతులు, కాళ్లు స్పర్శ లేనట్లు అవుతాయి. చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్లు అవుతుంది. కండరాలు పట్టేస్తాయి. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకుని మెగ్నిషియం లోపం ఉంటే అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
మెగ్నిషియం ఉండే ఆహారాలు
మెగ్నిషియం మనకు పాలకూర, ఇతర ఆకుకూరలు, నట్స్, సీడ్స్, అవకాడో, అరటి పండ్లు, డార్క్ చాకొలేట్, చేపలు, చీజ్, పప్పు దినుసులు వంటి అనేక ఆహారాల్లో లభిస్తుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెగ్నిషియం లోపం రాకుండా ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.