చిక్కి.. దీన్నే పల్లి పట్టీ అంటారు. సాధారణంగా చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ధర కూడా తక్కువగానే ఉంటాయి. ఇండ్లలోనూ వీటిని సులభంగా చేసుకోవచ్చు. భలే రుచిగా ఉండడమే కాదు, శరీరానికి కావల్సిన శక్తిని పల్లి పట్టీలు అందిస్తాయి. అయితే మీకు తెలుసా..? అసలు పల్లి పట్టీల కథ ఎలా ప్రారంభమైందో.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అది 1888వ సంవత్సరం. అప్పట్లో భారత్‌లో రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ముంబైలోని లోనావాల ఏరియాలో రైల్వే లైన్ నిర్మాణ పని జరిగింది. అది వర్షాకాలం సీజన్‌లో ఫేమస్ స్పాట్‌గా కూడా మారింది. అయితే రైల్వే లైన్ పనులు చేసే కార్మికులకు ఆరోగ్యంగా ఉండడం కోసం, తక్షణ శక్తిని అందించడం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఏదైనా ఆహారాన్ని తయారు చేసి ఇవ్వాలనుకున్నారు. అందులో భాగంగానే మగన్‌లాల్ అనే వ్యక్తి చిక్కిని తయారు చేశాడు. తరువాత మగన్‌లాల్ చిక్కి అనేది చాలా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నుంచి తయారు అవుతున్న చిక్కిగా మగన్‌లాల్ చిక్కి పేరుగాంచింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర దానికి ఉంది.
పల్లి పట్టీలు ఎంతో రుచిగా ఉండడమే కాదు, శక్తిని, పోషకాలను అందించేవి. పల్లీలు, బెల్లంను కలిపి తయారు చేస్తారు కనుక పోషకాలకు పోషకాలు, శక్తి లభించేవి. దీనికి తోడు వీటి ధర కూడా తక్కువగానే ఉండేది. అందువల్ల పల్లి పట్టీలు క్లిక్ అయ్యాయి. అప్పటి నుంచి.. అంటే సుమారుగా 126 ఏళ్ల నుంచి పల్లి పట్టీలు మనుగడలో ఉన్నాయి.
పల్లి పట్టీల్లో బెల్లం పాకంను సరైన మోతాదులో వేస్తేనే అసలు రుచి వస్తుంది. ఆ మోతాదు సరిగ్గా కలిపితే పల్లి పట్టీలకు చక్కని టేస్ట్ వస్తుంది. ఇక పల్లి పట్టీలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. వీటిని నిల్వ చేయడం కూడా సులభమే.
గర్భంతో ఉన్నవారు పల్లి పట్టీలను తింటే బలం వస్తుంది. బిడ్డ ఎదుగులకు సహాయ పడుతుంది. నిత్యం పోషకాలు, శక్తి అందడం లేదని అనుకునే వారు పల్లి పట్టీలను తింటే మంచిది.
పల్లి పట్టీలను ప్రస్తుతం అనేక రకాల ఫ్లేవర్లతో తయారు చేస్తున్నారు. వీటికి భలే డిమాండ్ ఉంది. డ్రై ఫ్రూట్స్, చాకొలేట్, స్ట్రాబెర్రీ, అల్లం.. ఇలా రక రకాల రుచులను కలిపి పల్లి పట్టీలను తయారు చేస్తున్నారు. కానీ సాంప్రదాయ పల్లి పట్టీలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు.