Finger : మన శరీరంలో అన్ని భాగాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. మనిషికి మనిషికీ ఇవి ఆకారం, రంగులో మార్పులను కలిగి ఉంటాయి. కానీ అందరికీ ఒకే శరీర అవయవాలు ఉంటాయి. అయితే కొన్ని భాగాల విషయానికి వస్తే మాత్రం.. కొందరికి కొన్ని అవయవాలు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా కాలి బొటన వేలి కన్నా చూపుడు వేలు పొడవుగా కొందరికి ఉంటుంది. ఇలా మహిళలకు ఉంటే వారు తమ భర్తలను డామినేట్ చేస్తారని.. వారిపై అజమాయిషీ చేస్తారని.. చాలా మంది విశ్వసిస్తుంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా కాలి బొటన వేలి కన్నా చూపుడు వేలు ఎక్కువ పొడవుగా ఉంటే ఆ స్థితిని వైద్య పరిభాషలో mitten foot అని లేదా Morton’s toe అని పిలుస్తారు. 1884 నుంచి 1960 వరకు జీవించిన అమెరికన్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫుట్ అనాటమిస్ట్ డడ్లీ జాయ్ మోర్టన్ పేరు మీదుగా అలాంటి స్థితికి మోర్టన్స్ టో అని పేరు పెట్టారు. ఆయన ఇలాంటి స్థితిని గుర్తించారు. కనుక ఆయన పేరు మీదుగా ఆ పేరు పెట్టారు.
అయితే ఇది జన్యు సంబంధ కారణాల వల్లే ఎక్కువగా వస్తుందని.. అంతేకానీ.. ఇందులో మూఢ నమ్మకాలు ఏవీ ఉండవని సైంటిస్టులు అంటున్నారు. కాలి బొటన వేలి కన్నా చూపుడు వేలు పొడవుగా ఉంటే అలాంటి మహిళలు తమ భర్తలపై అజమాయిషీ చేస్తారని అనడంలో అర్థం లేదని.. ఇది ఎంత మాత్రం నిజం కాదని అంటున్నారు. ఇలా చాలా మందికి భిన్నమైన అవయవాలు ఆకారంలో, రంగులో మార్పులకు గురై ఉంటాయని.. వీటిల్లో మూఢ విశ్వాసాలను పాటించాల్సిన పనిలేదని అంటున్నారు. ఇదీ.. దాని వెనుక ఉన్న అసలు విషయం..!