Chapati : రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటే బరువు తగ్గవచ్చని, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని.. చాలా మంది భావిస్తుంటారు. అందుకనే రాత్రి పూట అన్నం తినకుండా చపాతీలను తింటుంటారు. ఇక కొందరు నూనె లేకుండా వాటినే పుల్కాలుగా కాల్చుకుని తింటుంటారు. అయితే ఆరోగ్య పరంగా చెప్పాలంటే.. ఇలా తినడం సరైందే. కానీ గోధుమపిండిని కూడా పొట్టు తీసిందే మనకు లభిస్తుంది. కనుక అందులో ఉండే పోషకాలు అన్నీ పోతాయి. తరువాతనే ఆ పిండిని విక్రయిస్తారు. దాన్ని మనం కొని చపాతీలను తయారు చేసుకుని తింటున్నాం. దీంతో అలాంటి చపాతీల్లో పోషకాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. అన్నంతో పోలిస్తే చపాతీలను తినడం బెటరే అయినా.. చాలా వరకు పోషకాలు తగ్గుతాయి కనుక.. మనకు ప్రయోజనాలు కూడా పెద్దగా కలగవు.
మరి చపాతీలను తింటూనే అధిక మొత్తంలో ప్రయోజనాలను పొందాలంటే.. అందుకు ఏం చేయాలి ? అంటే.. గోధుమ పిండికి సగభాగంలో.. అంటే.. 1 కిలో గోధుమ పిండిలో అర కిలో చొప్పున జొన్న పిండి, రాగుల పిండి, సజ్జల పిండి.. కలపండి. ఈ పిండిలన్నింటినీ బాగా కలిపాక వచ్చే పిండి మిశ్రమాన్ని డబ్బాలో నిల్వ చేయండి. దీంతో రాత్రి పూట మీకు కావల్సినన్ని చపాతీలను చేసుకుని తినండి. నూనె లేకుండా కాల్చితే ఇంకా మంచిది.
ఇలా చపాతీలను తయారు చేసుకుని రాత్రి పూట తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యం కూడా లభిస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులలో ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి. దీంతో మనకు ఈ పిండిల ద్వారా తయారు చేసే చపాతీలతో అధిక మొత్తంలో ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు. బీపీ నియంత్రణలోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా చపాతీలను వివిధ రకాల పిండిలను కలిపి తయారు చేస్తే మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.