Healthy Laddu : మనలో చాలా మందికి భోజనం చేసిన తరువాత తియ్యటి పదార్థాలను తినాలనిపిస్తుంది. కానీ బయట దొరికే స్వీట్స్ తినడం వల్ల అనారోగ్యానికి గురవుతాము. అలాంటి వారు బయట దొరికే స్వీట్స్ తినడం కంటే ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ తో లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ లడ్డూలను షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా తినవచ్చు. కానీ ప్రస్తుత తరుణంలో డ్రైఫ్రూట్స్ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సామాన్యులు , మధ్య తరగతి ప్రజలు వీటిని కొనలేని పరిస్థితి నెలకొంది. డ్రైఫ్రూట్స్ కి బదులుగా అంతే శక్తిని ఇచ్చే ఇతర పదార్థాలను వాడుకుని కూడా మనం లడ్డూలను తయారు చేసుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ కి బదులుగా పొద్దు తిరుగుడు విత్తనాల పప్పు, పుచ్చకాయ గింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, కొబ్బరి పొడిని ఉపయోగించి ఈ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు. ఇవి మనకు కొద్దిగా తక్కువ ధరలోనే లభిస్తాయి. వీటిని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా ఆయా పదార్థాలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఖర్జూర పండ్లను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో మిక్సీ పట్టుకున్న ఖర్జూర పండ్లను వేసి కొద్దిగా తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఉడికించిన తరువాత వేయించి పెట్టుకున్న పప్పులను, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని లడ్డూలను తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలు 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
తీపి తినాలనిపించినప్పుడు స్వీట్స్ కి బదులుగా వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. డ్రైఫ్రూట్స్ తో కూడా ఇదే విధంగా లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలలో కొలెస్ట్రాల్ ఉండదు. మాంసం కంటే 5 రెట్ల ఎక్కువ బలాన్ని ఈ లడ్డూలు తినడం ద్వారా పొందవచ్చు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్ ఈ లడ్డూలలో అధికంగా ఉంటాయి. పిల్లలు, బాలింతలు, గర్భిణీలు వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందుతాయి.