Jonna Java : జొన్నలు ఎంతటి అద్భుతమైన ఆహారమో అందరికీ తెలిసిందే. మనకు అందుబాటులో ఉన్న చిరు ధాన్యాల్లో ఇవి ఒకటి. వీటితో రొట్టెలను చాలా మంది తయారు చేసుకుని తింటారు. అయితే జొన్నలతో జావ తయారు చేసుకుని తాగినా ఎంతో రుచిగా ఉంటుంది. వేసవిలో ఈ జావను తాగడం వల్ల మనకు చల్లదనం లభిస్తుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే జొన్న జావను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – అర టీ స్పూన్, ఉడికించిన స్వీట్ కార్న్ – పావు కప్పు, ఉడికించిన పచ్చి బఠానీ – పావు కప్పు, ఉప్పు – రుచికి తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిక్కటి మజ్జిగ – అర కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు.
జొన్న జావ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కానీ, రోట్లో కానీ అల్లం ముక్కలను, జీలకర్రను, పచ్చి మిర్చి ముక్కలను వేసి కచ్చ పచ్చ మిశ్రమంగా చేసుకోవాలి. తరువాత ఒక చిన్న గిన్నెలో జొన్న పిండిని తీసుకుని, అందులో అర కప్పు నీటిని పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ జొన్న పిండికి ఒక కప్పు నీళ్ల చొప్పున, రెండు టేబుల్ స్పూన్ ల పిండికి రెండు కప్పుల నీళ్లను పోసుకుని, తక్కువ మంటపై బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు రుచికి సరిపడా ఉప్పును, ముందుగా ఉండలు లేకుండా చేసి పెట్టుకున్న జొన్న పిండిని, కచ్చ పచ్చగా చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలిపిన తరువాత.. మంటను మధ్యస్థంగా ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని, అందులో క్యారెట్ తురుము, తరిగిన కొత్తిమీర, ఉడికించిన స్వీట్ కార్న్, పచ్చి బఠానీలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ జావ పూర్తిగా చల్లారిన తరువాత మజ్జిగను పోసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న జావ తయారవుతుంది. ఈ జావను వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. దీన్ని ఫ్రిజలో పెట్టి తాగవచ్చు. ఉదయాన్నే తాగితే శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. షుగర్ ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి ఈ జావ ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో అనేక పోషకాలు కూడా లభిస్తాయి.