Sesame Seeds Rice : ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల అన్నాన్ని ఎక్కువగా తింటున్నారు. బ్రౌన్ రైస్‌ను తినడం లేదు. మన పెద్దలు, పూర్వీకులు ముడి బియ్యాన్ని ఎక్కువగా తినేవారు. కనుకనే వారు షుగర్, బీపీ లాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇప్పటికీ ఆరోగ్యంగా, దృఢంగా జీవిస్తున్నారు. కానీ మనం మాత్రం తెల్ల అన్నాన్ని ఎక్కువగా తింటున్నాం. దీంతో అధిక బరువు, డయాబెటిస్, బీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నాం. అయితే మనకు అందుబాటులో ఉన్న తెల్ల అన్నాన్నే ఈ విధంగా వండుకుని తింటే.. అది ఎంతో ఆరోగ్యకరంగా మారుతుంది. అలాంటి అన్నాన్ని తింటే అనారోగ్య సమస్యలు రావు. పైగా పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఈ క్రమంలోనే నువ్వులతో ఆరోగ్యకరమైన రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – రెండు పెద్ద స్పూన్లు, అన్నం – ఒక కప్పు, నువ్వుల పొడి – రెండు టీస్పూన్లు, పోపు దినుసులు – టీస్పూన్, జీడిపప్పు – ఐదు (నిలువుగా కట్ చేయాలి), ఎండు మిర్చి – రెండు, మిరియాలు – పావు టీస్పూన్, నెయ్యి – రెండు పెద్ద టీస్పూన్లు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా.
నువ్వుల రైస్‌ను తయారు చేసే విధానం..
పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది కాగిన తరువాత ఎండు మిర్చి, పోపు దినుసులు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. ఇందులో నువ్వులు వేసి కాస్త వేగనివ్వాలి. బరకగా చేసిన మిరియాల పొడి, తగినతం ఉప్పును కూడా కలపాలి. ఇందులో పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నం కలపాలి. ఇది కలిపిన తరువాత నువ్వుల పొడి వేసి కాసేపు రైస్‌ను మగ్గనివ్వాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీంతో రుచికరమైన నువ్వుల రైస్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.