Chicken Liver : సాధారణంగా మాంసాహార ప్రియులు చాలా మంది చికెన్, మటన్‌లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే వీటితోపాటు వచ్చే లివర్‌ను కూడా చాలా మంది తింటారు. అయితే చికెన్ లివర్ కన్నా మటన్ లివర్‌ను తినేందుకే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే చికెన్ లివర్‌ను కూడా తినవచ్చు. దీన్ని ఆరోగ్యానికి హానికరమైందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి చికెన్ లివర్‌ను తింటే మనకు అనేక పోషకాలు లభించడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక చికెన్ లివర్‌ను మన దేశంతోపాటు ఇతర ఆసియా దేశవాసులు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
చికెన్ లివర్‌లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. చికెన్ లివర్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లివర్ ను తింటే 12 మిల్లీగ్రాముల మేర ఐరన్ లభిస్తుంది. దీని వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
చికెన్ లివర్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. పాలు, కోడిగుడ్లు, మటన్, ఇతర మాంసాహారాల కన్నా విటమిన్ ఎ చికెన్ లివర్‌లోనే అధికంగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లివర్ లో 10.5 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఎ లభిస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు పోతాయి. కనుక చికెన్ లివర్‌ను తరచూ తినాలి.
ఇక చికెన్ లివర్‌లో విటమిన్ బి2 కూడా ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రాముల ఈ లివర్‌తో 1.2 మిల్లీగ్రాముల మేర విటమిన్ బి2 లభిస్తుంది. ఇది శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా మనం తినే పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. రక్తనాళాలు గట్టిపడకుండా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చికెన్ లివర్‌లో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఇతర పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. బీపీని తగ్గిస్తాయి. జింక్ వల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇలా చికెన్ లివర్‌తో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక చికెన్ లివర్ హానికరం కాదు. ఇది మనకు ఆరోగ్యకరమైనది. దీన్ని తరచూ తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.