Bread Kaja : సాధారణంగా బ్రెడ్‌ను చాలా మంది తరచూ పాలు లేదా టీలో ముంచుకుని తింటుంటారు. బ్రెడ్‌ను కాల్చి టోస్ట్ మాదిరిగా కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. అయితే బ్రెడ్‌తో తీపి వంటకాలను కూడా తయారు చేయవచ్చు. వాటిల్లో బ్రెడ్ కాజా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అద్భుతమైన టేస్ట్‌ను అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ కాజా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ ముక్కలు – 6, పంచదార – 100 గ్రా., నూనె – డీప్ ఫ్రై కు సరిపడా, యాలకుల పొడి – కొద్దిగా, నీళ్లు – 100 ఎంఎల్, తరిగిన పిస్తా పప్పు – కొద్దిగా.
బ్రెడ్ కాజా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పంచదారను, నీళ్లను పోసి పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. తరువాత వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకుని యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత బ్రెడ్ కు నాలుగు వైపులా నల్లగా ఉండే భాగాన్ని తొలగించి, బ్రెడ్ ను మధ్యలోకి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార మిశ్రమంలో వేసి 2 నిమిషాల పాటు ఉంచి మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కాజా తయారవుతుంది. తీపి పదార్థాలను తినాలనిపించినప్పుడు చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలోనే ఇలా బ్రెడ్ కాజాను తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.