Kalakand : పాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేవి పాలు. పాలతో మనం అనేక రకాల తీసి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పాలతో తయారు చేసే వాటిల్లో కలాకంద్ ఒకటి. కలాకంద్ మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. బయట దొరికే కలాకంద్ ధర ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో, చాలా సులువుగా మనం ఇంట్లోనే కలాకంద్ ను తయారు చేసుకోవచ్చు. కలాకంద్ తయారీకి కావల్సిన పదార్థాలు.. దాని తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలాకంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పాలు – 2 లీటర్లు, పంచదార – 300 గ్రా., నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – కొద్దిగా.
కలాకంద్ తయారీ విధానం..
ముందుగా నిమ్మ ఉప్పును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లను పోసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత చిన్నగా ఉండే ఒక ఇనుప కళాయిలో పాలను పోసి మధ్యస్థ మంటపై పాలను కలుపుతూ మరిగించుకోవాలి. పాలు మరింత చిక్కగా తయారయిన తరువాత కరిగించి పెట్టుకున్న నిమ్మ ఉప్పును వేసి మళ్లీ కలుపుతూ ఉండాలి. నిమ్మ ఉప్పు వేసిన 10 నిమిషాల తరువాత పాలు మరింత చిక్కగా తయారవుతాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పంచదారను వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. తరువాత కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసిన 10 నిమిషాల తరువాత పాలు రంగు మారడమే కాకుండా కళాయికి అతుక్కోకుండా ముద్దలా తయారవుతాయి.
ఇప్పుడు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి గాలి తగలకుండా గిన్నెను మూతతో కానీ, అల్యూమినియం పేపర్ తో కానీ మూసి 2 గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. 2 గంటల తరువాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తసుకుని కావల్సిన పరిమాణంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా బయట దొరికేలా ఉండే కలాకంద్ తయారవుతుంది. 2 లీటర్ల పాలతో మనం 750 గ్రా. ల కలాకంద్ ను తయారు చేసుకోవచ్చు. ఇందులో నిమ్మ ఉప్పుకు బదులుగా నిమ్మ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఎంతో రుచిగా ఉండే కలాకంద్ తయారవుతుంది. దీన్ని ఎంచక్కా తింటూ రుచిని ఆస్వాదించవచ్చు.