Sweet Potato : దుంపలు అనగానే సహజంగానే చాలా మందికి బరువును పెంచేవిగా అనిపిస్తాయి. ఆలుగడ్డలు అదే జాబితాకు చెందుతాయి. కొన్ని ఇతర దుంపలు కూడా బరువును పెంచుతాయి. అయితే చిలగడ దుంపలు కూడా దుంపకూరల జాబితాకు చెందుతాయి కనుక ఇవి కూడా బరువును పెంచుతాయని చాలా మంది అనుకుంటుంటారు. అయితే దీనికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చిలగడ దుంపలు దుంపకూరల జాబితాకు చెందుతాయి కనుక ఇవి బరువును పెంచుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇవి బరువును పెంచవు సరికదా.. బరువును తగ్గించుకునేందుకు సహకరిస్తాయి. మన దేశంలో కాదు కానీ.. పలు ఇతర ఆసియా దేశాల్లో చిలగడదుంపలను బరువు తగ్గించే ఆహారంగా పరిగణిస్తారు. కనుక వీటిని తింటే బరువు పెరుగుతారని అనడంలో అర్థం లేదు. వీటిని తింటే బరువు పెరగరు.. తగ్గుతారు.
ఇక ఈ దుంపల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల చిలగడ దుంపలను తినడం వల్ల సుమారుగా 86 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే చిలగడదుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది. కనుక చిలగడ దుంపలను తరచూ తినాలి.
యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనాల ప్రకారం.. చిలగడదుంపను రోజుకు ఒకటి తిన్నా చాలు.. శరీరంలో కొవ్వు కరిగే శాతం 20 నుంచి 25 వరకు పెరుగుతుందని తేల్చారు. అందువల్ల ఈ దుంపలను తింటే కొవ్వును కరిగించుకోవచ్చని స్పష్టమైంది. అన్ని రకాల దుంపల్లా ఈ దుంపలు కాదు. ఇవి బరువును పెంచవు, తగ్గిస్తాయి.
ఇక చిలగడ దుంపల ద్వారా బరువు తగ్గాలని చూసేవారు వీటిని ఉడికించి తినాలి. అప్పుడే మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఉడకబెట్టిన చిలగడదుంపను రోజుకు ఒకటి తింటే చాలు.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.