Snoring : మనలో చాలా మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఊబకాయం, మానసిక ఒత్తిడి, ధూమపాసం, మధ్యపానం, సైనస్, ఆస్తమా వంటి వాటి వల్ల శ్వాస మార్గంలో అంతరాలు ఏర్పడి గురక వస్తుంది. గురక వల్ల మనతోపాటు ఇతరులు కూడా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలను ఉపయోగించి మనం గురక సమస్య నుండి బయట పడవచ్చు. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కలిపి ఆ నీటిని పడుకునే ముందు తాగడం వల్ల గురక సమస్య తగ్గుతుంది. దీంతోపాటు ఒక టీ స్పూన్ తేనెలో ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె కలిపి దానిని పడుకునే ముందు తాగడం వల్ల కూడా గురక రాకుండా ఉంటుంది.
ఇవే కాకుండా ఒక జార్ లో క్యారెట్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, కొద్దిగా అల్లం, కొద్దిగా నిమ్మ రసాన్ని వేసి జ్యూస్ లా చేసుకోవాలి. ఈ జ్యూస్ ను పడుకునే ముందు తాగడం వల్ల గురక సమస్య తగ్గుతుంది. గురక వచ్చే వారు వెల్లకిలా పడుకోకుండా ఏదో ఒక వైపు తిరిగి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల గురక రాదు. అంతే కాకుండా పడుకునే ముందు పచ్చి అటుకులను తినడం వల్ల కూడా గురక రాకుండా ఉంటుంది.
అలాగే వేడి నీళ్లలో యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాస మార్గంలో ఉండే అవరోధాలు తొలగిపోయి గురక రాకుండా ఉంటుంది. పడుకునే ముందు ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేసి రెండు చుక్కలను ముక్కు రంధ్రాలలో వేసుకోవడం వల్ల గురక సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పుదీనా నూనెను చేతులకు రాసుకుని ఆ వాసనను చూడడం వల్ల కూడా గురక రాకుండా ఉంటుంది. గురక వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక గురక సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుండి బయట పడవచ్చు.