Guntagalagara Aaku : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారు రోజు రోజుకీ ఎక్కువవుతున్నారు. ఈ సమస్యల నుండి బయట పడడానికి మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపులను, నూనెలను వాడుతుంటారు. కొందరు వైద్యులను కూడా సంప్రదిస్తూ ఉంటారు. అయినప్పటికీ జుట్టు సమస్యలు తగ్గకపోవడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఆయుర్వేదం ద్వారా జుట్టు సమస్యలన్నింటినీ మనం తగ్గించుకోవచ్చు.
ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రసాదించింది. ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో గుంటగలగరాకు ఒకటి. దీనిని బృంగరాజ్, కేశ రాజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వ కాలంలో దీనిని ఉపయోగించి కాటుకను కూడా తయారు చేసేవారు. ఈ ఆకును వాడడం వల్ల మనకు వచ్చే అనేక రకాల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. దీని కోసం గుంటగలగరాకు మొక్క ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి 4 నుండి 5 రోజుల పాటు ఎండ బెట్టాలి. తరువాత ఒక జార్ లో ఎండిన ఆకులను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల గుంటగలగరాకు పొడిని వేసి అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా వేడి నీటిని వేసి కలిపి జుట్టుకు బాగా పట్టించి 3 గంటల తరువాత తల స్నానం చేయాలి
ఇలా తరచూ చేస్తుంటే అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడువుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో పెరుగుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా వాడవచ్చు. గుంటగలగరాకు పొడిని తయారు చేసుకోవడం అందరికీ సాధ్యపడదు. అలాంటి వారు ఆయుర్వేద షాపులలో లభ్యమయ్యే గంటగలగరాకు పొడిని వాడవచ్చు. దీన్ని ఆన్‌లైన్‌లో భృంగరాజ్ పొడి పేరిట విక్రయిస్తున్నారు. దీన్ని వాడుకోవచ్చు. ఇలా తరచూ ఈ పొడిని వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు కలగవని.. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.