Chepala Pulusu : విటమిన్ డి ని, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా కలిగి ఉన్న ఆహారాల్లో చేపలు ఒకటి. చేపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. చేపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చేపలతో చేసే వంటకాలల్లో చేపల పులుసు ఒకటి. చేపల పులుసు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుత కాలంలో చేపల పులుసు తయారీలో వివిధ రకాల మసాలాలను ఉపయోగిస్తున్నారు. ఇది రుచిగా ఉన్నప్పటికి మన పెద్దల కాలంలో చేసే చేపల పులుసు అంతలా రుచి ప్రస్తుతం రావడం లేదు. మన పెద్దల కాలంలో చేసే విధంగా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపల ముక్కలు – 1 కేజీ, ఉప్పు – తగినంత, కారం – మూడు టీ స్పూన్స్, పసుపు – రెండు టీ స్పూన్స్, పెద్దగా తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), వెల్లుల్లి రెబ్బలు – 15, ధనియాలు – రెండు టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చింతపండు – 80 గ్రా., నీళ్లు – ఒకటిన్నర లీటర్, తరిగిన టమాటాలు – 3, నూనె – 4 టేబుల్ స్పూన్స్, మెంతులు – ఒక టీ స్పూన్, కరివేపాకు – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – 10, మిరియాలు – ఒక టీ స్పూన్, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు, లవంగాలు – 5, కొత్తిమీర – ఒక కప్పు.
చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపును వేసి కలిపి అర గంట పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర వేసి పేస్ట్ లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టమాటాలను కూడా ముక్కలుగా చేసి జార్ లో వేసి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును కడిగి అర లీటర్ నీళ్లను పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయరు చేసుకునే కళాయిని తీసుకుని నూనె వేసి కాగిన తరువాత మెంతులను, ముందుగా పేస్ట్ లా చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి.
ఇది కొద్దిగా వేగిన తరువాత కరివేపాకును వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత పసుపు, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును, కారాన్ని వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసిపెట్టుకున్న టమాట ప్యూరీని వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచాలి. 2 నిమిషాల తరువాత మూత తీసి ఉల్లిపాయ, టమాట మిశ్రమాన్ని గిన్నె అంతా సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మిరపకాయలను గిన్నె అంతా అక్కడక్కడా వేసుకోవాలి. తరువాత ముందుగా కలిపి ఉంచిన చేప ముక్కలను గిన్నె అంతా సమానంగా వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి.
తరువాత చింతపండు గుజ్జుతోపాటు లీటర్ నీళ్లను పోసి పెద్ద మంటపై గరిట పెట్టి తిప్పకుండా కేవలం గిన్నెను మాత్రమే కదిలించి మూత పెట్టాలి. ఇప్పుడు రోలులో కానీ, జార్ లో కానీ మిరియాలను, యాలకులను, దాల్చిన చెక్క, లవంగాలను వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెపై ఉంచిన మూతను తీసి మరో సారి గిన్నెను కదిపి పొడిగా చేసుకున్న మసాలాను వేసి మూత పెట్టి చేప ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. చేప ముక్కలు ఉడికిన తరువాత గిన్నెను మరో సారి అంతా కలిసేలా కలిపి చివరిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారవుతుంది. ఇందులో ఉపయోగించిన మసాలాలను అప్పటికప్పుడు తయారు చేసుకోవడం వల్ల చేపల పులుసు రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకున్న వెంటనే కాకుండా 4 లేదా 5 గంటల వరకు అలాగే ఉంచిన తరువాత తినడం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది. చేపలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.