Raju Gari Pulao : ప్రస్తుత తరుణంలో ప్రజల రుచులు, ఆహారపు అలవాట్లు బాగా మారాయి. కొత్త కొత్త రుచులను కోరుకుంటున్నారు. అలాంటి రుచుల్లోంచి పుట్టిందే.. రాజు గారి పులావ్. దీన్ని రెస్టారెంట్లలోనే మనం తినవచ్చు. కానీ కాస్త శ్రమిస్తే ఇంట్లోనూ దీన్ని అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో రుచిగా రాజుగారి కోడి పులావ్‌ను ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
రాజు గారి కోడి పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, నానబెట్టిన బాస్మతి బియ్యం – రెండు గ్లాసులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడి పప్పు – అర కప్పు, అనాస పువ్వు – 2, లవంగాలు -8, యాలకులు- 4, బిర్యానీ ఆకులు – 2, జాపత్రి – 1, నూనె – 6 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయలు – అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, పచ్చి మిర్చి పేస్ట్- ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, పుదీనా – అర కప్పు, కొత్తిమీర – ఒక కప్పు, పెరుగు – 200 గ్రా., నీళ్లు – 5 గ్లాసులు.
రాజు గారి కోడి పులావ్ ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో ముందుగా నెయ్యిని వేసి వేడయ్యాక జీడిపప్పు, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత నూనె వేసి కాగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపును వేసి కలిపి శుభ్రంగా కడిగిన చికెన్ ను వేసి కలిపి మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత తరిగిన పుదీనా, కొత్తిమీరను వేసి కలపాలి. తరువాత పెరుగును వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి మరోసారి కలపాలి.
చికెన్ 80 శాతం ఉడికిన తరువాత నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు పెద్ద మంటపై, 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. తరువాత మూత తీసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి మరో సారి కలిపి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాజుగారి కోడి పులావ్ తయారవుతుంది. దీనిని నేరుగా ఉల్లిపాయ, నిమ్మ రసంతో కలిపి తినవచ్చు. రైతాతో కలిపి తిన్నా కూడా రుచిగా ఉంటుంది.