Hyderabadi Special Egg Curry : కోడిగుడ్లను చాలా మంది రకరకాలుగా వండుతుంటారు. కోడిగుడ్డు ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్, టమాటా కూర.. ఇలా అనేక రకాలుగా కోడిగుడ్లను తింటుంటారు. అయితే కోడిగుడ్లతో ఒక ప్రత్యేకమైన కూరను చేయవచ్చు. ఇది హైదరాబాదీ ఫేమస్ కర్రీ. ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త శ్రమించాలే కానీ ఎంతో రుచిగా దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక హైదరాబాదీ స్పెషల్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ స్పెషల్ ఎగ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
హైదరాబాదీ స్పెషల్ ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా వెడల్పు ఎక్కువగా ఉన్న కళాయిని తీసుకుని అందులో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు కారాన్ని, రుచికి తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇలా కలిపిన తరువాత ధనియాల పొడిని, గరం మసాలాని, నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తరువాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు గరిటెతో ఉల్లిపాయలను కొద్దిగా పక్కకు జరిపి ఒక కోడిగుడ్డుని పగలకొట్టి అందులో వేయాలి. మిగిలిన గుడ్లను కూడా అలాగే వేయాలి.
ఇలా వేసిన కోడిగుడ్లను అలాగే ఉంచాలి. గరిటెతో అంతా కలపకూడదు. చిన్న ముక్కలుగా చేయరాదు. పెద్దగా కొట్టిన గుడ్లను కొట్టినట్లే ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటపై కోడిగుడ్లు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. కోడిగుడ్లు పూర్తిగా ఉడికిన తరువాత నెమ్మదిగా మరో వైపుకు తిప్పి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి.. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ స్పెషల్ ఎగ్ కర్రీ తయారవుతుంది. ఈ ఎగ్ కర్రీని దేంతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా కోడిగుడ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. తరచూ చేసుకునే ఎగ్ కర్రీకి బదులుగా ఇలా కూడా ఎగ్ కర్రీని చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు కూడా లభిస్తాయి.