Dosa Batter : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా దోశలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని ఎలా తయారు చేసుకోవాలో మనందరికీ తెలుసు. వీటి రుచి కూడా మనకు తెలుసు. కానీ కొందరు ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా దోశలను ఎర్రగా కరకరలాడుతూ హోటల్స్ లో లభించే విధంగా తయారు చేయలేకపోతుంటారు. ఇంట్లో కూడా మనం హోటల్స్ లో లభించే విధంగా ఉండే దోశలను తయారు చేసుకోవచ్చు. హోటల్స్ లో లభించే విధంగా దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక కప్పు, బియ్యం – రెండు కప్పులు, మెంతులు – అర టీ స్పూన్, అటుకులు – పావు కప్పు, శనగ పప్పు – పావు కప్పు, ఉప్పు – తగినంత, పంచదార – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – అర కప్పు.
హోటల్ స్టైల్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినప పప్పును, శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో బియ్యాన్ని, మెంతులను వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి వీటిని కూడా 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అటుకులను పిండి పట్టడానికి 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి తగినన్ని నీళ్లను పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండినంతటినీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 6 గంటల పాటు లేదా ఒక రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా పులిసి దోశలు రుచిగా వస్తాయి.
తరువాత పిండిపై ఉంచిన మూతను తీసి మరోసారి బాగా కలిపి మనకు కావల్సిన పరిమాణంలో మరో గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశలు వేయడానికి తీసుకున్న పిండిలో రుచికి తగినంత ఉప్పును, పంచదారను, పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీటిని పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడయ్యాక కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని పలుచగా దోశ వేసుకోవాలి. దీనిపై అర టీ స్పూన్ నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే హోటల్ స్టైల్ దోశలు తయారవుతాయి.
దోశల తయారీలో శనగ పప్పును ఉపయోగించడం వల్ల దోశలు కరకరలాడుతూ ఉంటాయి. పంచదారను ఉపయోగించడం వల్ల దోశలు ఎర్రగా ఉంటాయి. దోశ పిండిని మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇలా నిల్వ చేసుకునేటప్పుడు పిండిలో ఉప్పును వేసి కలపరాదు. ఇలా ఉప్పును కలపడం వల్ల పిండి త్వరగా పులుస్తుంది. మనకు కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకున్న తరువాతే ఉప్పును కలపాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల దోశలను ఎప్పుడూ వేసుకున్నా కూడా ఎర్రగా, కరకరలాడుతూ ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న దోశలను పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటితో కలిపే తింటే చాలా రుచిగా ఉంటాయి.