ఫలానా ప్రదేశంలో ఫలానా దేవుడు లేదా దేవత ఒకప్పుడు తిరిగారనో, కాలుమోపారనో లేదంటే అక్కడ వారి విగ్రహాలు వెలిశాయనో భక్తులు ఆయా దేవుళ్లు, దేవతల పేరిట గుళ్లు కట్టించడం సాధారణంగా జరిగే విషయమే. అయితే రాజస్థాన్‌లోని ఆ ప్రాంతంలో మాత్రం ఏకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌నే దైవంగా వెలసిందని భావిస్తూ అక్కడి ప్రజలు కొలుస్తున్నారు. ఆ బుల్లెట్ బైక్‌కు నిత్యం పూజలు, అభిషేకాలు చేయడం, హారతులు పట్టడం, గాజులు, దుస్తులు వంటివి సమర్పించి కోర్కెలు తీర్చమని వేడుకోవడం… ఇప్పుడక్కడ జరుగుతున్న తంతు. ఈ క్రమంలో ఆ బైక్‌ను దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు రోజూ అక్కడికి చేరుకుంటున్నారు కూడా. వినేందుకు షాకింగ్‌గా ఉన్నా మేం చెబుతోంది నిజమే. ఇంతకీ ఆ బుల్లెట్ బైక్ ఎవరిది..? దాని కహానీ ఏంటి..? ఓ లుక్కేద్దామా..!
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1991లో ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం బన్నా అనే ఓ యువ లీడర్ ఉండేవాడు. అతనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి బైక్ ఉండేది. అయితే ఒకరోజు బన్నా అనుకోకుండా ఓ చౌరస్తాలోని చెట్టుకు తన బైక్‌తో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆ బైక్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ ఎవరూ తీసుకు రాకుండానే ఆ బైక్ యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి దానంతట అదే రాత్రి పూట వచ్చిందట. మరుసటి రోజు పోలీసులు ఆ బైక్‌ను చైన్‌లతో కట్టి తీసుకెళ్లారు. అయినా బైక్ మళ్లీ అలాగే వచ్చిందట. దీంతో పోలీసులు దాన్ని అలాగే వదిలేశారు. అయితే అప్పటి స్థానికులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు.
తమ లీడర్ బన్నా దురదృష్టవశాత్తూ చనిపోవడంతో బైక్ రూపంలో మళ్లీ తన వద్దకు వచ్చాడని స్థానికులు భావించి ఆ బైక్‌ను యాక్సిడెంట్ అయిన చెట్టు వద్దే ఉంచి దాన్ని పూజించడం మొదలు పెట్టారు. దీంతో ఆ బైక్ ఉన్న ప్రదేశం కాస్తా బుల్లెట్ బాబా పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆ బైక్‌కు రోజూ పూజలు చేయడం కోసం ఓ అర్చకున్ని కూడా నియమించారు స్థానికులు. అతను రోజూ వచ్చి బుల్లెట్ బైక్‌ను తుడిచి, కడిగి పూజలు చేస్తాడు. స్థానికులు కూడా ఆ బైక్‌కు దండలు వేసి ప్రార్థిస్తారు. కొందరైతే గాజులు, దుస్తులు సమర్పిస్తూ తమ కోర్కెలను తీర్చాలని ఆ బుల్లెట్ బాబాను వేడుకుంటున్నారు. దీంతో రోజూ అక్కడికి వస్తున్నభక్తుల సంఖ్య కూడా పెరుగుతుండడం విశేషం. అయితే ఆ బుల్లెట్ బాబాకు స్థానికులు సమర్పిస్తున్న నైవేద్యం ఏంటో తెలుసా..? మద్యం… అవును, మీరు విన్నది కరెక్టే. బీర్, బ్రాందీ, విస్కీ… ఇలా అదీ, ఇదీ అని తేడా లేదు. ఏ రకం మద్యాన్నయనా భక్తులు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఎందుకంటే… ఆ బుల్లెట్ బాబాకు, అదేనండీ… ఆ బన్నాకు మద్యం అంటే ఇష్టమట…అందుకే అదే నైవేద్యంగా పెడుతున్నారు. ఏది ఏమైనా… ఇలా ఓ మోటార్ బైక్‌ను దేవుడిగా భావించి పూజలు చేయడం ఆశ్చర్యంగానే ఉంది కదా..!