తమిళ ప్రజలకు తలైవా ఆయన… కానీ దేశం మొత్తానికి మాత్రం ఓ సూపర్ స్టార్. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఉన్న అభిమానులు మన దగ్గర ఇతర ఏ సినీ నటులకూ లేరేమో..! ఆయన సినిమా వస్తుందంటే చాలు… అప్పుడు ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. సినిమా రిలీజైన రోజైతే అభిమానులకు ఇక పండగే. అంతటి అభిమానం చూరగొన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన తన 74వ పుట్టిన రోజును గత డిసెంబర్‌లో జరుపుకున్నారు. కానీ చూస్తే అలా అనిపించరు. ఇంకా యువకులలాగే ఉత్సాహంగా ఉంటారు. అందుకు ఆయన కఠిన దినచర్యే కారణం. మరోవైపు అత్యంత శ్రద్ధతో కూడిన ఆహారపు అలవాట్లు. ఆయన్ను ఇంకా నవయువకునిలాగే ఉంచుతున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ చూసేందుకు వయస్సు మీరి కనబడుతున్నా ఆయన మాత్రం ఇంకా యువకుడిలా ఉత్తేజంగా ఉంటారు. సినిమాల్లో స్టంట్స్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి డూప్ లేకుండానే చేస్తారనే పేరుంది. అయితే ఆయన ఇప్పటికీ అలా ఉత్సాహంగా ఉండడానికి కారణం ఆయన దినచర్యే. రజనీ 40 ఏళ్ల వయస్సు నుంచే చక్కెర, అన్నం, పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలను తీసుకోవడం మానేశారు. ఈ ఆహార నియమావళిని ఆయన కచ్చితంగా పాటిస్తున్నారు.
కేవలం ఆహారంలోనే కాదు, వ్యాయామంలోనూ ఆయన కచ్చితంగా శ్రద్ధను కనబరుస్తారు. నిత్యం రెండు పూటలా యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఆయనకు అలవాటు. ఉదయం 5 గంటలకే నిద్ర లేచే ఆయన ముందుగా వాకింగ్ చేస్తారు. అనంతరం కొంత సేపు జాగింగ్ చేసి యోగా చేస్తారు. మళ్లీ సాయంత్రం వాకింగ్ కంటిన్యూ అవుతుంది. అనంతరం కొంత సేపు ధ్యానం. దీంతో ఆయన ఒత్తిడి నుంచి బయట పడతారట. ఈ క్రమంలోనే ఆయన తన ప్రతి సినిమా విడుదల అవగానే కొన్ని రోజుల పాటు ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. దీంతో ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతను పొందుతారు ఆయన. ఇదీ తలైవా, సూపర్ స్టార్ రజనీ ఉత్తేజం వెనుక ఉన్న అసలు విషయం..!