Vayyari Bhama : పొలాల గట్ల వెంబడి అనేక రకాల కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. ఇలా పెరిగే మొక్కలలో వయ్యారి భామ మొక్క ఒకటి. అందమైన పేరు కలిగి ఉన్నప్పటికీ.. ఇది అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. దీనిని క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కు పుడక, ముక్కు పుల్లాకు గడ్డి మొక్క అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క చాలా సులువుగా పెరిగి పంట పొలాలను నాశనం చేస్తుంది. పంట దిగుబడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా వయ్యారి భామ మొక్క ప్రజలపై, పశువులపై కూడా దుష్పభ్రావాలను చూపిస్తుంటుంది. పంటలకు వేసే ఎరువులను కూడా ఈ మొక్క లాగేస్తుంది. ఈ మొక్క 40 శాతం వరకు పంట దిగుబడిని తగ్గిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ మొక్క స్రవించే రసాయనాల కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ మొక్క పువ్వులపై ఉండే పుప్పొడి.. టమాట, వంకాయ, మిరపకాయ వంటి మొక్కలపై పడడం వల్ల ఆ మొక్కల పువ్వులు, పిందెలు రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పంటలకు వచ్చే అనేక రకాల చీడపీడలకు, తెగుళ్లకు ఈ మొక్క నివాసంగా ఉంటుంది. ఈ మొక్క విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి గాలి ద్వారా మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణించి అక్కడ మొలుస్తాయి. ఈ మొక్క వల్ల మనుషులకు తీవ్రమైన జ్వరం, ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వస్తాయి. వయ్యారి భామ మొక్క ఆకులు చర్మానికి తగిలితే తామర వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం 80 శాతం వరకు ఉంటుంది.
ఈ మొక్క పుప్పొడిని పీల్చడం వల్ల జలుబు, కను రెప్పల వాపులు, కళ్లు ఎర్రగా మారడం వంటివి జరుగుతాయి. ఈ మొక్క ఆకులు పశువులకు తాకితే పశువుల వెంట్రుకలు రాలిపోతాయి. పశువులు ఈ మొక్కను తినవు. ఒకవేళ పొరపాటున తింటే పశువుల అవయవాలు ఒక్కొకటిగా దెబ్బ తిని ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఈ మొక్కను తిన్న పశువుల పాలను తాగడం వల్ల మనలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వయ్యారిభామ మొక్క ఎక్కడకనబడితే అక్కడ పీకి వేయాలి. పొలాల దగ్గర ఉండే వయ్యారి భామ మొక్కలను పువ్వులు పూయక ముందే పీకేసి బురదలో తొక్కేయాలి.
పువ్వులు పూసిన మొక్కలను వేర్లతో సహా పీకేసి కాల్చేయాలి. కాల్చేటపుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. తంగేడు చెట్లు ఉన్న చోట ఈ మొక్కలు ఉండవు. వయ్యారి భామ మొక్కలను నివారించే శక్తి తంగేడు మొక్కలకు ఉంది. ఈ కలుపు మొక్క పూత దశకు రాకముందే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పును కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ మొక్కలు ఎదగకుండా ఉంటాయి. ఈ మొక్కలు పూత దశకు రాకముందే రైతులు జాగ్రత్త తీసుకోవాలి. ఒక వేళ ఈ మొక్క నుండి పువ్వులు వస్తే ఆ పువ్వుల నుండి కొన్ని వేల సంఖ్యలో విత్తనాలు వచ్చి మళ్లీ మొక్కలుగా పెరిగి పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. వయ్యారి భామ మొక్కను పీకేటప్పుడు చేతులకు తొడుగులను ధరించాలి. లేదంటే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.