Diarrhea : మనం అప్పుడప్పుడూ విరేచనాల బారిన పడుతూ ఉంటాం. కొందరిలో విరేచనాలతోపాటు కడుపు నొప్పి కూడా వస్తుంటుంది. విరేచనాల బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, తాగే నీరు కారణంగా కూడా విరేచనాలు కలుగుతాయి. బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల కారణంగా కూడా విరేచనాలు కలుగుతాయి. మద్యం అతిగా తాగినా కూడా విరేచనాలు కలుగుతాయి. డయాబెటిస్, థైరాయిడ్ కారణంగా కూడా విరేచనాలు బారిన పడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి వాడే మందుల కారణంగా కూడా విరేచనాలు అవుతాయి. కొందరు చిన్న పిల్లలు కూడా తరచూ విరోచనాల బారిన పడుతూ ఉంటారు.
విరేచనాల బారిన పడడం వల్ల శరీరంలో ఉండే నీరు అంతా పోయి నీరసంగా తయారవుతారు. తిన్న ఆహారం శరీరానికి పట్టక సన్నగా తయారవుతారు. విరేచనాలను వెంటనే తగ్గించుకోవాలి. లేకపోతే నీరసంతో స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. విరేచనాలను తగ్గించుకోవడానికి మందులను, యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడే పని లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
మనం దానిమ్మ గింజలను తిని తొక్కలను పడేస్తూ ఉంటాం. కానీ దానిమ్మ తొక్కలను ఉపయోగించి మనం విరేచనాలను తగ్గించుకోవచ్చు. దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయానికి పటిక బెల్లాన్ని కలిపి తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. దీనిని పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. సోంపు గింజల పొడిని, పటిక బెల్లం పొడిని, కరక్కాయ పొడిని, శొంఠి పొడిని సమపాళ్లలో తీసుకుని నీటిలో కలిపి తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.
చిన్న పిల్లల్లో విరేచనాలతోపాటు కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటే అల్లం రసాన్ని బొడ్డులో వేయడం వల్ల కడుపు నొప్పితోపాటు విరేచనాలు కూడా తగ్గుతాయి. వస పొడిని తీసుకుని దానికి తేనెను కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. పిల్లలకు కూడా దీనిని ఇవ్వవచ్చు.ఈ చిట్కాలను పాటించడం వల్ల విరేచనాలను మనం తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించేటప్పుడు సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.