Atukula Mixture : మనం ఆహారంగా అటుకులను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అటుకులు త్వరగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తరచూ తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. అటుకులతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అటుకులతో చేసే మిక్చర్ ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. అటుకుల మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పేపర్ అటుకులు – పావు కిలో, పచ్చి మిరపకాయలు – 6 లేదా రుచికి తగినంత, అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 8, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – గుప్పెడు, పసుపు – అర టీ స్పూన్, పుట్నాల పప్పు – అర కప్పు.
అటుకుల మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా ఒక జార్ లో పచ్చి మిర్చిని, అల్లం ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. తరువాత పసుపును, పుట్నాల పప్పును వేసి కలిపి వేయించుకకోవాలి. ఇవి అన్ని వేగిన తరువాత అటుకులను వేసి మంటను చిన్నగా చేసి బాగా కలిపి అటుకులు కరకరలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల మిక్చర్ తయారవుతుంది. దీనిని మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా ఇలా అటుకుల మిక్చర్ ను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.