Lice : మనలో కొందరు వయసుతో సంబంధం లేకుండా తలలో పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు. మన జుట్టులో నివాసాన్ని ఏర్పరుచుకుని మన తల నుండి రక్తాన్ని సేకరిస్తూ జీవించే రెక్కలు లేని బాహ్య పరాన్న జీవులు పేలు. వీటి కారణంగా తలలో ఎప్పుడూ దురద పెడుతూ ఉంటుంది. దురదల కారణంగా చాలా మంది వేళ్లతో తలను గోకడం వల్ల పుండ్లు పడి అవి ఇతర చర్మ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది.
పేలు ఎక్కువగా ఉన్న వారి దువ్వెనలను, టవల్స్ ను ఉపయోగించినా లేదా వారితో సన్నిహితంగా ఉన్నా పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. పేల వల్ల కలిగే దురదల వల్ల ఆ వ్యక్తులు ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు. కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల తలలో పేల సమస్య నుండి బయటపడవచ్చు. పేల సమస్యతో బాధపడే వారు కొబ్బరి నూనెలో హారతి కర్పూరాన్ని వేసి వేడి చేసి ఆ నూనెను తలకు బాగా పట్టించాలి. ఇలా చేసిన గంట తరువాత తలస్నానం చేయడం వల్ల తలలో పేల సమస్య తగ్గుతుంది.
అలాగే మెంతులను నీటిలో నానబెట్టి వాటిలో హారతి కర్పూరాన్ని వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు బాగా పట్టించి ఒక గంట తరువాత గోరు వెచ్చని నీటితోపాటు కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయడం వల్ల తలలో పేలు పోతాయి. అదే విధంగా వెల్లుల్లి రెబ్బలకు, నిమ్మ రసాన్ని కలిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇలా చేసిన ఒక గంట తరువాత తలస్నానం చేసి పేల దువ్వెనతో తలను దువ్వడం వల్ల పేలు అన్నీ బయటకు వస్తాయి.
తలలో పేలు ఎక్కువగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు తలకు వైట్ వెనిగర్ ను రాసి జుట్టును దగ్గరగా ఉంచి పడుకోవాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో అలాగే కుంకుడు రసంతో తలస్నానం చేయడం వల్ల పేల సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాలను తరచూ పాటించడం వల్ల పేలను తగ్గించుకోవచ్చు.