Kothimeera Rice : మనం వంటల తయారీలో కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరను వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం వంటల్లోనే కాకుండా కొత్తిమీరతో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర పేస్ట్ – ముప్పావు కప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం – ఒక గ్లాస్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 5 లేదా తగినన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, టమాట గుజ్జు – అర కప్పు, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నీళ్లు – ఒకటింపావు గ్లాస్.
మసాలా దినుసులు..
లవంగాలు – 3, యాలకులు -3, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1.
కొత్తిమీర రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి నూనె వేడయ్యాక మసాలా దినుసులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత టమాట గుజ్జును వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలాను కూడా వేసి 5 నిమిషాలపాటు వేయించాలి.
తరువాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లను పోసి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో కూడా కలిపి తినవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా కొత్తిమీరతో రైస్ ను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.