Beauty Tips : ఎటువంటి మచ్చలు, మొటిమలు, ముడతలు లేని అందమైన ముఖం ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అందంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం సహజసిద్ధంగా.. అందంగా.. కనబడేలా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఒక ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల రెండు వారాల్లోనే అందంగా కనబడవచ్చు. చర్మ సంబంధిత సమస్యలను తగ్గించి అందంగా కనబడేలా చేసే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ శనగ పిండిని తీసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ బియ్యం పిండిని వేసి కలపాలి. ఇందులోనే చిటికెడు పసుపును, అర చెక్క నిమ్మ రసాన్ని కూడా వేయాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా రోజ్ వాటర్ ను వేస్తూ ఉండలు లేకుండా పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇప్పుడు చేతి వేళ్లతో సున్నితంగా మర్దనా చేసుకోవాలి.
తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను పూర్తిగా ఆరే వరకు ఉంచి కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని రాసి మర్దనా చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. చర్మంపై ఉండే మృతకణాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మంపై ఉండే ముడతలు తొలగిపోయి చర్మం బిగుతుగా, మృదువుగా తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారీలో మనం అన్నీ సహజసిద్ధమైన పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తాన్నాం. కనుక ఈ ఫేస్ ప్యాక్ ను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండానే ముఖం అందంగా.. కాంతివంతంగా తయారవుతుంది. దీంతో సహజసిద్ధమైన అందం వస్తుంది. ఇలా ఈ చిట్కాతో ముఖాన్ని అందంగా కనిపించేలా చేయవచ్చు.