మనం ఆహారంలో భాగంగా ప్రతి రోజూ పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. పెరుగుతో మనం ఎంతో రుచిగా ఉండే దద్జోజనాన్ని కూడా చేసుకుని తినవచ్చు. దద్జోజనాన్ని తయారు చేయడం చాలా సులభం. రుచిగా దద్జోనాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దద్దోజనం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక చిన్న గ్లాస్, నీళ్లు – రెండున్నర గ్లాసులు, వేడి చేసిన పాలు – ఒకటిన్నర గ్లాస్, పెరుగు – 2 గ్లాసులు, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు.
దద్జోజనం తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో బియ్యాన్ని వేసి శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి గంటెతో అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. తరువాత కొద్దికొద్దిగా పాలను పోస్తూ కలుపుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. అన్నం చల్లగా అయిన తరువాత పెరుగును, తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసిన తాళింపును ముందుగా పెరుగు వేసి కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దద్జోజనం తయారవుతుంది. పెరుగన్నాన్ని నేరుగా తినలేని వారు ఇలా దద్జోజనంగా చేసుకుని తినడం వల్ల రుచితోపాటు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగుతో చేసిన ఈ దద్జోజనాన్ని అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్ కోసం తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.