మనం ఎక్కువగా తినే మాంసాహార ఉత్పత్తుల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చికెన్ లో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. చికెన్ తో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాల్లో చికెన్ బిర్యానీ కూడా ఒకటి. చికెన్ బిర్యానీని చాలా మంది ఇష్టంగా తింటారు. బిర్యానీని తయారు చేయడం సమయం, శ్రమతో కూడిన పని అనే కారణం వల్ల దీనిని చాలా మంది ఇంట్లో తయారు చేయడానికి ఇష్టపడరు. కానీ బిర్యానీని మనం చాలా సులభంగా, చాలా త్వరగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతి బియ్యం – 300 గ్రా., చికెన్ – అర కిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్లు, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, బిర్యానీ మసాలా పొడి – ఒక టీ స్పూన్, తరిగిన పుదీనా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), నీళ్లు – పావు తక్కువ రెండు గ్లాసులు.
మసాలా దినుసులు..
సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 2, యాలకులు – 2, దాల్చిన చెక్క ముక్కలు – 2, మరాఠీ మొగ్గలు – 2, జాపత్రి – కొద్దిగా, అనాస పువ్వులు – 2, బిర్యానీ ఆకు – 1.
చికెన్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పసుపు, పుదీనా, కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత దీనిని కదిలించకుండా అర గంట పాటు ఉంచాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె కాగిన తరువాత మసాలా దినుసులను, జీడిపప్పును వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ను వేసి కలపాలి. తరువాత కుక్కర్ పై సాధారణ మూత ఉంచి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్నీ వేసి కలపాలి. తరువాత నీళ్లను కూడా పోసి కలిపి కుక్కర్ పై మూత ను ఉంచాలి. దీనిని మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి పొడిగా, రుచిగా ఉండే చికెన్ బిర్యానీ తయారువుతుంది. దీనిని నేరుగా లేదా రైతా, మసాలా కూర వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చికెన్ బిర్యానీని కుక్కర్ లో చేయడం వల్ల చాలా త్వరగా, సులభంగా అవడంతోపాటు రుచిగా కూడా ఉంటుంది. టైమ్ లేనప్పుడు చికెన్ బిర్యానీని ఇలా సులభంగా కుక్కర్‌లో తయారు చేయవచ్చు. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.