Banana Leaf : మన పూర్వీకులు ఎక్కువగా భోజనాన్ని అరిటాకుల్లోనే చేసేవారు. అరిటాకుల్లో భోజనం చేయడమనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం. మన పెద్దలు ఏది చేసినా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. అదేవిధంగా అరిటాకులో భోజనం చేయడం వెనుక కూడా ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ప్రస్తుత కాలంలో విందు భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లను, కాగితపు ప్లేట్ లను వాడుతున్నారు. పూర్వం ఇవి అన్నీ లేని రోజుల్లో అరిటాకుల్లో మాత్రమే భోజనం చేసే వారు.
అరిటాకులో కమ్మని ఆహారపదార్థాలను చూడగానే తినకుండానే సగం కడుపు నిండిన భావన మనలో చాలా మందికి కలుగుతుంది. ఇన్ని రకాల చెట్ల ఆకులు ఉండగా కేవలం అరటి ఆకునే ఎందుకువాడే వాడాలి అనే సందేహం కూడా మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అరిటాకులో ఎక్కువగా పాలీ ఫినాల్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అరిటాకుపై వేడి వేడి ఆహార పదార్థాలు వడించగానే ఆకు పై పొరల్లో ఉండే పాలీ ఫినాల్స్ భోజనంలో కలిసిపోతాయి. దీని వల్ల శరీరానికి పోషకాలు అందడమే కాకుండా తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది.
అరటి పండులో ఉన్నట్టే అరిటాకులో కూడా పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల అరిటాకుపై భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా అరిటాకుకు విషాన్ని గ్రహించే శక్తి కూడా ఉంటుంది. భోజనంలో ఉండే విష పదార్థాలను గ్రహించిన వెంటనే అరిటాకు నల్లగా మారిపోతుంది. దీని వల్ల భోజనం చేసే వారికి ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది. అరిటాకులో భోజనం చేయడం వల్ల వాత, కఫ దోషాలు తొలగిపోతాయి.
దీంతోపాటు మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. తరచూ అరిటాకులలో భోజనం చేయడం వల్ల మన వెంట్రుకలు నల్లగా, దృఢంగా మారుతాయి. జుట్టు తెల్లబడిన వారు ఎక్కువగా అరిటాకులో భోజనం చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అదే విధంగా ఏదైనా ఆహార పదార్థంలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఆ పదార్థాన్ని మనం పడేస్తూ ఉంటాం. ఆ పదార్థం ఉన్న పాత్రపై మూత తీసి ఆ స్థానంలో అరటి ఆకును మూతగా ఉంచి కొద్ది సమయం వరకు కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ పదార్థంలో అధికంగా ఉన్న ఉప్పును అరిటాకు గ్రహిస్తుంది. దీని వల్ల కూరలో ఉప్పు శాతం తగ్గి కూర రుచిగా మారుతుంది. ఈ విధంగా అరిటాకులో భోజనం చేయడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.