Molathadu : మనం పూర్వకాలం నుండి వస్తున్న ఎన్నో ఆచారాలను ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం. మన పూర్వీకులు అలవాటు చేసిన ఈ ఆచారాల వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. వారి అనుభవ సారాలను రంగరించి కొన్ని ఆచార వ్యవహారాలను మన నిత్యం జీవితంలో పాటించేలా అలవాటు చేశారు. అలాంటి ఒక అలవాటే పురుషులు మొల తాడు కట్టుకోవడం. మన దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మొలతాడు కట్టుకునే అలవాటు ఉంటుంది.
పూర్వం రోజుల్లో అందరూ పంచె కట్టుకునే వారు. కట్టుకున్న పంచె జారిపోకుండా దానిపై నుండి మొలతాడు కట్టుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో మొలతాడు స్థానాన్ని బెల్ట్ ఆక్రమించింది అని చెప్పవచ్చు. అసలు మొలతాడును ఎందుకు కట్టుకోవాలి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటి.. మొలతాడు కట్టుకోకపోతే ఏం జరుగుతుంది.. వంటి తదితర ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధర్మ శాస్త్రం ప్రకారం మొలతాడు మన శరీరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. నాభి పైన ఉన్న భాగాన్ని దేవతా స్థానమని, నాభి కింది భాగాన్ని రాక్షస స్థానం అంటారు. మొలతాడు కట్టిన పై భాగం అలంకారం, పూజా పునస్కారాలకు సంబంధించిందని శాస్త్రాల్లో చెప్పబడింది. శాస్త్రాన్ని పక్కన పెట్టి విజ్ఞానపరంగా చూసుకుంటే మొలతాడు కట్టుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కండరాలు గట్టి పడతాయి. హెర్నియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
దీని కారణంగానే పూర్వం కాలంలో పురుషులు మొలతాడు కట్టుకునే వారు. అలాగే స్త్రీలు నడుముకు వడ్డాణం పెట్టుకునే వారు. ఇలా మొలతాడును కట్టుకోవడం వల్ల మూత్ర పిండాల పని తీరు మెరుగుపడుతుందని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. మన సంప్రదాయం ప్రకారం ఎరుపు, నలుపు రంగుల్లో ఉండే మొలతాడును పురుషులు కట్టుకుంటారు. కొంతమంది వెండి, బంగారం వంటి లోహాలతో చేసిన మొలతాడును కూడా ధరిస్తారు.
మొలతాడును కట్టుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మొలతాడును బుధవారం, ఆదివారం మూత్రమే కట్టుకోవాలి. మంగళవారం, శుక్రవారం అసలు కట్టుకోకూడదు. అలాగే కొత్త మొలతాడును పాత మొలతాడు తొలగించిన తరువాతే కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.