Immunity Foods : గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మన దేశంలో కూడా ఈ మహమ్మరి కారణంగా చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల సంఖ్య తక్కువగా ఉందనే చెప్పవచ్చు. ఈ కరోనా మహమ్మరి మన దేశంపై అంతగా ప్రభావం చూపించలేకపోయిందన్న విషయాన్ని మనలో చాలా మంది గ్రహించే ఉంటారు. దీనికి కారణం మన దేశ వేద విజ్ఞానం గొప్పతనం అనే చెప్పవచ్చు.
బయటి నుండి ప్రవేశించే ఎలాంటి వైరస్ అయినా మన శరీరంలోని రోగ నిరోధక శక్తితో పోరాడి గెలిచిన తరువాత మాత్రమే మన శరీరంలోకి ప్రవేశించగలదు. ఇతర దేశస్తులతో పోలిస్తే మన భారతీయుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. దీనికి కారణం మన ఆహార అలవాట్లే అని చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు మన శరీరంలో రోగ నిరోధక శక్తి సరిగ్గా పని చేయడానికి కావల్సిన ఆహారమైన వెల్లుల్లి, పసుపు, మిరియాలు, అల్లం, ఉల్లి వంటి వాటిని మన నిత్య జీవితంలో ఉపయోగించేలా అలవాటు చేశారు. దీని వల్ల మన భారతీయుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.
ఇవే కాకుండా నిత్యం దొరికే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుకుని ఎటువంటి వైరస్ లు మనదరి చేరకుండా చేసుకోవచ్చు. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ క్యారెట్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే బీటాకెరోటీన్ లు, బి విటమిన్లు.. యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజ పరిచి రోగాల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి.
అలాగే తరచూ పాలకూరను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే గ్లూటాడియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది.
వెల్లుల్లి మన శరీరంలో ప్రవేశించిన బాక్టీరియాను సమర్థవంతంగా అరికట్టడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో ఎటువంటి ఇన్ ఫెక్షన్ లు రాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే 2 వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటితోపాటు క్యాబేజ్, చిలగడ దుంప, మొలకెత్తిన గింజలు, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకుంటూ ఉండాలి.
అలాగే రోజూ 3 లీటర్ల నీటిని తాగడంతోపాటు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఈ నియమాలను పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.