Banana : మనం ఆహారంగా అనేక రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనకు అందుబాటు ధరల్లో అలాగే విరివిరిగా లభించే వాటిల్లో అరటి పండ్లు కూడా ఒకటి. అరటి పండ్లు ఎంతో మధురంగా ఉంటాయి. వీటిని ఇష్టంగా తినే వారు ఉంటారు. అలాగే అరటి పండ్లే కదా అని తేలికగా తీసుకునే వారు కూడా ఉంటారు. ఇతర పండ్ల లాగా అరటి పండులో కూడా మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
అరటి పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అరటి పండ్లను తినడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండులో 27 గ్రాముల కార్బొహైడ్రేట్స్, 3 గ్రాముల ఫైబర్, 14 గ్రాముల సహజసిద్ధమైన చక్కెరలు, 105 క్యాలరీల శక్తి ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి అరటి పండు చక్కని ఆహారమని చెప్పవచ్చు. ఆకలి వేసినప్పుడు అరటి పండు తింటే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. అలాగే ఆకలి కూడా త్వరగా వేయదు. తద్వారా మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం.

భోజనం తిన్న తరువాత అరటి పండును తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థాలు ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో సహాయపడతాయి. తద్వారా మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అరటి పండులో అధికంగా ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. రోజుకు 2 అరటి పండ్లను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకునే శక్తి కూడా అరటి పండ్లకు ఉంటుంది.
అరటి పండ్లలో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలోకి ప్రవేశించగానే సెరిటోనిన్ గా మారి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు అరటి పండును తిని పాలు తాగడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. తిమ్మిర్ల వ్యాధితో బాధపడే వారు రోజూ ఒక అరటి పండును తినడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. తరచూ అరటి పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం మచ్చలు ఉండే అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయని రుజువైంది. కనుక అరటి పండును తినే అలవాటు లేని వారు దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ విధంగా అరటి పండును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.