Memory Drink : పిల్లలు బాగా చదవాలని, అందరి కంటే ముందు ఉండాలని తల్లిదండ్రలు కోరుకోవడం సహజం. కానీ కొంత మంది పిల్లలు చదివినప్పటికీ పరీక్షల సమయం వచ్చే సరికి మరిచిపోతుంటారు. మరికొంత మంది పిల్లలు ఎంత చదివినా గుర్తుంచుకోలేక పోతుంటారు. అలాగే కొందరికి చదువుపై ఆసక్తే ఉండదు. ప్రస్తుత సమాజంలో మెదడుకు పని చెప్పకపోతే అసలు బ్రతకలేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు పిల్లలు సృజనాత్యకంగా ఆలోచించాలంటే మెదడు చురుకుగా పని చేయాలి. మన ఇంట్లోనే సహజసిద్ధ పదార్థాలతో డ్రింక్ ను తయారు చేసి ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వడం వల్ల వారి మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
మెదడు పనితీరును పెంచే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. వంటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం 5 బాదం గింజలను, 3 వాల్ నట్స్ ను, ఒక యాలక్కాయను, అర టీ స్పూన్ పసుపును, ఒక గ్లాస్ పాలను, అర టీ స్పూన్ కొబ్బరి నూనెను, రుచికి తగినంత పటిక బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా బాదం గింజలను ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాత ఈ బాదం గింజలపై ఉండే పొట్టును తీసి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వాల్ నట్స్ ను, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను లేదా పాలను పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో పాలను పోసి వేడి చేయాలి. ఈ పాలలోనే మిక్సీ పట్టుకున్న బాదం గింజల మిశ్రమాన్ని వేసి అడుగు భాగం మాడకుండా కలుపుతూ ఉండాలి. తరువాత యాలక్కాయను దంచి వేయాలి. తరువాత పసుపును వేసి కలపాలి. పసుపు వేసిన తరువాత పాలను 5 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాలను ఒక గ్లాస్ లో పోసి పిల్లలు భరించగలిగేంత వేడి ఉండే వరకు ఉంచాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ వంటల్లో ఉపయోగించే కొబ్బరినూనెను, పటిక బెల్లాన్ని వేసి కలపాలి.
ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే పిల్లలకు ఇవ్వాలి. ఇలా తయారు చేసుకున్న పాలను పిల్లలకు ఇవ్వడం వల్ల మెదడులోని కణాల పనితీరు మెరుగుపడి మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇలా తయారు చేసుకున్న పాలను తాగవచ్చు. ఈ పాలను తాగడం వల్ల వయస్సు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పాలను పిల్లలకు ఇవ్వడం వల్ల వారి జ్ఞాపక శక్తి పెరిగి చదువులలో రాణించగలుగుతారు.