Pregnant Women : గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేవి స్త్రీల జీవితంలో ముఖ్యమైన సందర్భాలు. ఎంతో సంక్లిష్టమైనవి కూడా. ఈ సమయంలో వారి శరీరం భౌతికంగా, మానసికంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది. శరీరం పూర్తిగా మారిపోతుంది. స్త్రీలు గర్భం దాల్చిన దగ్గరనుండి తమ ఆరోగ్యం కోసం ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి అలవాట్లు బిడ్డ యొక్క శారీరక, మానసిక పోషణను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం తినాలనుకోవడం సాధారణ విషయమే. కుటుంబ సభ్యుల తోడ్పాటు, ప్రేమతో వారికి అన్ని వంటలు చేసి పెట్టడం వంటివి కూడా ఉంటాయి. కానీ ఇలాంటి సమయంలోనే వారు తినే ఆహారం విషయంలో, తాగే పానీయాల విషయంలో ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి.
గర్భంతో ఉన్న సమయంలో స్త్రీల శరీరం డీ హైడ్రేషన్ కి గురి కాకుండా ఉండడానికి ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలను తీసుకోవాలి. అవి గర్భసంచిలో ఉమ్మనీరు ఏర్పడడానికి సహాయపడతాయి. తల్లి కాబోయే వారు రోజూ 8 నుండి 12 గ్లాసుల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అయితే ఇలాంటి కీలకమైన సమయంలో గర్భిణీ స్త్రీలు తినకూడని, తాగకూడని పదార్థాలు కూడా చాలా ఉన్నాయి. ఈ పదార్థాలు కొన్ని సందర్భాల్లో అసమతుల్యానికి కారణమవుతాయి. ఇక గ్రీన్ టీ వలన కలిగే వివిధ రకాల ప్రయోజనాల గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ గర్భంతో ఉన్నవారు గ్రీన్ తాగడం వలన అనేక ప్రమాదాలు ఉన్నాయి.
గ్రీన్ టీ లో అధికంగా ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ ఇంకా పాలీఫినాల్స్ వంటి మూలకాలు ఇన్ఫెక్షన్లకు కారణం అయ్యే బాక్టీరియాలతో పోరాడతాయి. కానీ దీనిలో ఉండే కెఫీన్ కొద్ది మోతాదులో ఉన్నప్పటికీ దాని వలన డీఎన్ఏ కి కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రీన్ టీ ని అధిక మోతాదులో తాగడం వల్ల దీనిలో ఉండే కెఫీన్ బొడ్డు ప్రేగులో రక్త ప్రసరణను అడ్డుకొని బిడ్డ డీఎన్ఏ కణాలను నష్ట పరచడం వల్ల అబార్షన్ అవడానికి అవకాశాలు ఉంటాయి.
ఇంకా కాఫీ, గ్రీన్ టీ లో ఉండే కెఫీన్ వలన నెలలు నిండక ముందే తక్కువ బరువుతో బిడ్డ జన్మించే ప్రమాదం కూడా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వలన ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. దీని వల్ల శరీరంలోని ద్రవాల స్థాయిలు తగ్గిపోయి డీ హైడ్రేషన్ కి గురవుతారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు కాఫీ ఇంకా గ్రీన్ టీ లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.