Oats Pakoda : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తృణ ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒకటి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తింటే శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు ఓట్స్ వల్ల కలుగుతాయి. అయితే వీటిని నేరుగా తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటితో ఎంతో రుచిగా ఉండే పకోడీలను తయారు చేసి తినవచ్చు. దీంతో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ పొందవచ్చు. ఇక ఓట్స్ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – ఒకటిన్నర టీస్పూన్స్, పచ్చి మిర్చి – 2, కరివేపాకు – 2 రెబ్బలు, కొత్తిమీర – చిన్న కట్ట, ఉల్లిపాయ – 1, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె, ఉప్పు – తగినంత.
ఓట్స్ పకోడీలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో ఓట్స్, బియ్యం పిండి, శనగ పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. కొద్దిగా నూనెని వేడి చేసి ఇందులో పోయాలి. దీంట్లోనే పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తరువాత కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఈ నూనె కాగిన తర్వాత ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పకోడీలలా వేసి బాగా వేయించాలి. పకోడీలు ఎర్రగా కాలిన తరువాత బయటకు తీయాలి. వీటిని అలాగే సర్వ్ చేయాలి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా చట్నీలతో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.