ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ అనారోగ్య సమస్యగా మారింది. డయాబెటిస్ ఉందని తెలిశాక ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. అలాగే సరైన ఆహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కానీ కొందరిలో డయాబెటిస్ పట్ల అపోహలు నెలకొన్నాయి. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా డయాబెటిస్ పట్ల కొందరిలో నెలకొన్న అపోహలు, వాటికి సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కేవలం వయస్సు ఎక్కువ ఉన్న వారికే డయాబెటిస్ వస్తుంది ?
చాలా మంది కేవలం వయస్సు ఎక్కువ ఉన్న వారికే డయాబెటిస్ వస్తుందని, యుక్త వయస్సులో ఉన్నవారికి డయాబెటిస్ రాదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో 20, 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అలాగే కొందరికి వంశపారంపర్యంగా చిన్నతనం నుంచే టైప్ 1 డయాబెటిస్ వస్తోంది. అందువల్ల డయాబెటిస్ అనేది ఎవరికైనా రావచ్చు. కేవలం వయస్సు ఎక్కువ ఉన్నవారికి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు పడినట్లే.
2. డయాబెటిస్ మెడిసిన్‌ను ఎక్కువ కాలం పాటు తీసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి ?
డయాబెటిస్ వ్యాధి నిర్దారణ అయ్యాక చాలా మంది మెడిసిన్లను తీసుకుంటారు. అయితే కొందరికి షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వగానే వారు కిడ్నీలు డ్యామేజ్ అవుతాయని చెప్పి డయాబెటిస్ మెడిసిన్‌ను తీసుకోవడం మానేస్తారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే.. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఆ మెడిసిన్ ను తీసుకోవడం మానేస్తే.. షుగర్ లెవల్స్ మళ్లీ పెరుగుతాయి. అలాగే దాని వల్ల కళ్లు, నాడులు, గుండె, లివర్ వంటి భాగాలు దెబ్బ తినేందుకు అవకాశం ఉంటుంది. కనుక షుగర్ లెవల్స్ అదుపులోకి వచ్చినా డయాబెటిస్ మెడిసిన్‌ను తీసుకోవడం ఆపరాదు. ఆపితే పైన తెలిపిన సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి.
3. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు ?
షుగర్ లెవల్స్ అదుపులో ఉన్నాయని చెప్పి కొందరు లైట్ తీసుకుంటారు. అయితే నిజానికి హెచ్‌బీఏ1సి అని ఒక పరీక్ష ఉంటుంది. అందులో విలువలు కూడా అదుపులో ఉండేట్లు చూసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు లిపిడ్ ఫ్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారి అయినా సరే కళ్లు, పాదాలను పరీక్ష చేయించుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఆయా భాగాలకు సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
4. చక్కెర ఎక్కువ తినేవారికే డయాబెటిస్ వస్తుంది ?
ఇది కూడా అపోహే. నిజంగా ఇలా భావించరాదు. ఎందుకంటే చక్కెర ఎక్కువ తినడానికి, డయాబెటిస్‌కు సంబంధం లేదు. చక్కెర, స్వీట్లు, ఇతర జంక్ ఫుడ్ ఎక్కువగా తిననివారికి కూడా డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అందువల్ల చక్కెర తినే వారికే డయాబెటిస్ వస్తుందని అనుకోరాదు.
5. డయాబెటిస్ ఉన్నవారికి స్పెషల్ డైట్ కావాలి ?
ఇది అపోహ కాదు. అలా అని చెప్పి డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యేక డైట్ పాటించాల్సిన పనిలేదు. డాక్టర్ సూచన మేరకు డైట్ పాటించాలి. కానీ డయాబెటిస్ ఉన్న ఎవరైనా సరే పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి. రోజుకు 3 సార్లు హెవీగా భోజనం చేసే బదులు తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి. అలాగే తినే ఆహారాల్లో పీచు పదార్థం ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తినడం మానేయాలి. రోజూ తగినన్ని గంటల పాటు నిద్ర పోవాలి. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. డయాబెటిక్స్ ఎట్టి పరిస్థితిలోనూ క్రాష్ డైట్స్ పాటించరాదు. అవి మరిన్ని సమస్యలను తెచ్చి పెడతాయి.
6. ఇన్సులిన్ శరీరాన్ని నాశనం చేస్తుంది ?
డయాబెటిస్ రెండు ప్రధాన రకాలుగా ఉంటుందనే విషయం తెలిసిందే. టైప్ 1, టైప్ 2 అని ఉంటాయి. టైప్ 1 ఉండేవారిలో క్లోమ గ్రంథి పనిచేయదు. దీంతో వారు ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాలి. ఇక టైప్ 2 ఉన్నవారిలోనూ ట్యాబ్లెట్ల ద్వారా షుగర్ కంట్రోల్ కాకపోతే వారికి కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లను డాక్టర్లు సూచిస్తారు. అయితే డాక్టర్లు సూచించిన మోతాదులో కచ్చితంగా ఇన్సులిన్‌ను తగినంత తీసుకుంటే దాని వల్ల శరీరానికి ఎలాంటి నష్టం కలగదు. కనుక ఈ విషయంలోనూ డయాబెటిస్ ఉన్నవారు అపోహలకు గురి కావల్సిన పనిలేదు. ఇన్సులిన్‌ను నిర్భయంగా తీసుకోవచ్చు.