Snoring : గురక.. ఇది చాలా సాధారణమైన సమస్య. గురక వల్ల గురక పెట్టే వారితోపాటు ఇతరులు కూడా ఇబ్బంది పడుతుంటారు. నిద్రలో గాలి పీల్చుకుంటున్నప్పుడు కొండనాలుకతోపాటు అంగిట్లోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసేసి నిద్రలేమికి కారణమవుతాయి. గురక పెట్టే వారిని చాలా మంది తప్పు చేసినట్టుగా చూస్తూ ఉంటారు. గురక పెట్టడం వల్ల వచ్చే శబ్దం కారణంగా ఇతరులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అసలు గురక కచ్చితంగా ఈ కారణం చేతే వస్తుందని చెప్పలేము కానీ గురక రావడానికి కొన్ని కారణాలు మాత్రం ఉన్నాయి.
అసలు గురక ఎందుకు వస్తుంది.. దీనిని ఎలా నివారించుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రపోయే సమయంలో ముక్కు, గొంతు ద్వారా గాలి సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆ చుట్టూ పక్కల కణాలు ప్రకంపనలకు గురి అవుతాయి. ఇలా ప్రకంపనల వల్ల వచ్చే శబ్దాన్నే గురక అంటారు. బరువు ఎక్కువగా ఉండడం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు గురక ఎక్కువగా రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే గురకను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లోనే ఈ పదార్థాలను తయారు చేసుకుని తరచూ వాడుతూ ఉండడం వల్ల గురక మన దరిదాపుల్లోకి కూడా రాదని వారు అంటున్నారు.
తేనె, ఆలివ్ నూనెను కలిపి తీసుకోవడం వల్ల గురక తగ్గి చక్కని నిద్రను ప్రసాదిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 2 టీ స్పూన్ల ఆలివ్ నూనెలో 2 టీ స్పూన్ల తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. గురక సమస్యను తగ్గించుకోవాలంటే బాగా లావుగా ఉన్నవారు వీలైనంత త్వరగా బరువు తగ్గాలి. అలా తగ్గడానికి తగినంత వ్యాయామం చేయాలి. నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలా అమర్చుకోవాలి.
వేడి నీటిలో యాకలిప్టస్ నూనెను వేసి పడుకునే ముందు ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల శ్వాస మార్గాలు తెరుచుకుని గురక రాకుండా ఉంటుంది. అలాగే పడుకునే ముందు ఛాతి మీద, ముక్కు పైన, గొంతు పైన విక్స్, జండుబామ్ వంటి వాటిని రాసి మర్దనా చేయాలి. తరువాత వాటిపై వేడి గుడ్డతో కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల శ్వాస నాళాలు వ్యాకోచించి గురక రాకుండా ఉంటుంది. పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల గురక రావడం తగ్గు ముఖం పడుతుంది. దీంతో చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు.