ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా వేసవి కాలం వచ్చేసింది. ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయినప్పటికీ ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. దీంతో చాలా మంది వేసవి తాపానికి గురవుతున్నారు. వేసవిలో మనకు అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అది మనకు మంచికాదు. కనుక శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు కింద తెలిపిన ఆహారాలు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు.
1. పెరుగు
పెరుగు శీతల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఈ సీజన్‌లో పెరుగును నిత్యం తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. బీపీ అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. గుండె, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగును అన్నంతో తినవచ్చు. లేదా రైతా రూపంలో, మజ్జిగలా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.
2. పుదీనా
పుదీనాను తింటే మనకు తాజాదనం లభిస్తుంది. అలాగే శరీరం చల్లగా ఉంటుంది. ఇది కూడా మన శరీరాన్ని చల్లగా చేసే గుణాలను కలిగి ఉంటుంది. పుదీనాను నిత్యం చట్నీ, రసం, రైతా రూపంలో తీసుకోవచ్చు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
3. కీరదోస
వేసవిలో మనకు కీరదోస ఎక్కువగా లభిస్తుంది. ఈ సీజన్‌లో దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. సలాడ్స్ రూపంలో దీన్ని చాలా సులభంగా తినవచ్చు. ఇందులో అధిక శాతం నీరు ఉంటుంది. అందువల్ల ఎండ వల్ల కోల్పోయే ద్రవాలను దీంతో భర్తీ చేయవచ్చు. ఎండ దెబ్బకు గురికాకుండా ఉంటారు. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు లభిస్తాయి. కీరదోసలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కీరదోసలో చాలా స్వల్ప మోతాదులో క్యాలరీలు ఉంటాయి కనుక బరువు పెరుగుతామని భయం చెందాల్సిన పనిలేదు. దీన్ని నిర్భయంగా తీసుకోవచ్చు. శరీరం చల్లగా ఉంటుంది.
4. నిమ్మకాయ నీరు
వేసవిలో నిమ్మకాయ నీటిని కచ్చితంగా తాగాలి. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే శరీరానికి చల్లదనం లభిస్తుంది. శక్తి వస్తుంది. ఉత్సాహంగా మారుతారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం కోల్పోయిన ద్రవాలు తిరిగి వస్తాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మెటబాలిజం, రోగ నిరోధక శక్తి పెరుగుతాయి.
5. పుచ్చకాయలు, తర్బూజా
వేసవిలో మనకు పుచ్చకాయలు, తర్బూజాలు ఎక్కువగా లభిస్తాయి. కనుక వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి వల్ల శరీరం చల్లగా ఉంటుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యం అవుతాయి. పోషకాలు లభిస్తాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉంటుంది.