Tomato Curd Curry : మనం పెరుగును కడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగుతో తిననిదే చాలా మందికి భోజనం చేసినట్టుగా ఉండదు. అదే విధంగా పెరుగును కూడా మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. పెరుగును ఉపయోగించడమే కాకుండా పెరుగుతో కూడా మనం కూరలు చేసుకోవచ్చు. పెరుగును ఉపయోగించి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పెరుగుతో కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పెరుగు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – 5 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, చిక్కటి పెరుగు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట పెరుగు కూర తయారీ విధానం..
ఈ కూరను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో టమాట ముక్కలను తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఈ ముక్కలు చల్లగా అయ్యే వరకు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పెరుగు, జీలకర్ర పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాట, పెరుగు మిశ్రమాన్ని వేసి కలపాలి.
దీనిపై మూతను ఉంచి చిన్న మంటపై 3 నిమిషాల ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పెరుగు కూర తయారవుతుంది. దీనిని అన్నంతో అల్పాహారాలతో కూడా కలిపి తినవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా టమాట పెరుగు కూరను చేసుకుని తినవచ్చు.