Dosakaya Chicken : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో దోసకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది పప్పు, పచ్చడిలా చేస్తుంటారు. కొందరు టమాటాలతో కలిపి వండి తింటుంటారు. అయితే దోసకాయలను చికెన్‌తో కలిపి కూడా వండవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోసకాయ – ఒకటి, చికెన్ – అర కిలో, ఉల్లిపాయలు – ఒకటి, కారం – 4 టీస్పూన్లు, కొబ్బరి పొడి – ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీస్పూన్లు, గరం మసాలా – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – ఒక టీస్పూన్.
దోసకాయ చికెన్ ను తయారు చేసే విధానం..
చికెన్ ముక్కలకు ఉప్పు, కారం పట్టించి ఉంచాలి. పాన్‌లో నూనె పోసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేగాక చికెన్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొబ్బరి, ధనియాల పొడి వేసి సిమ్‌లో మరికాసేపు ఉడికించాలి. దీంతో దోసకాయ చికెన్ రెడీ అవుతుంది. బాగా ఉడికాక దింపేయాలి. ఇలా ఈ కూరను ఎంతో రుచిగా చేయవచ్చు. చపాతీలు లేదా అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు.