Back Pain : కీళ్ల నొప్పులు.. ఈ సమస్యతో బాధతో పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. చాలా మంది ఈ నొప్పులు రావడానికి ఊబకాయం కారణం అని అనుకుంటారు. కానీ సన్నగా ఉన్న వారు కూడా ఈ నొప్పుల బారిన పడుతున్నారు. ఈ కీళ్ల నొప్పుల కారణంగా నడవలేక, నిలబడలేక, కూర్చోలేక ఇబ్బంది పడుతున్న వారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కారణాలేవైనప్పటికి కీళ్ల నొప్పుల వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. కీళ్ల నొప్పులకు ఆయుర్వేదంలో కూడా చాలా మార్గాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులను తగ్గించే ఒక చక్కటి మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులను తగ్గించడంలో మనకు జిల్లేడు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. వృక్ష జాతిలో జిల్లేడు మొక్కకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కలో ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో జిల్లేడు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో జిల్లేడు మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. జిల్లేడు మొక్కలో రెండు రకాలు ఉంటాయి. దీనిలో దేనినైనా మనం ఉపయోగించవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్న వారు జిల్లేడు మొక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి.ఈ నీటిలో 10 జిల్లేడు పువ్వులను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటి నుండి పూలను వేరు చేసి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా మరిగించిన గోరు వెచ్చగా అయిన తరువాత దానిలో దూదిని ముంచి లేదా చేత్తో ఆ నీటిని తీసుకుంటూ కీళ్ల నొప్పులపై రాస్తూ మర్దనా చేయాలి.
పాదాల నొప్పులు, మడమల నొప్పులు ఉన్న వారు ఈ నీటిలో పాదాలను కూడా ఉంచవచ్చు. ఇలా నీటిని రాసిన తరువాత నీటిలో ఉడికించిన జిల్లేడు పువ్వులను నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఈ పువ్వులను రెండు గంట పాటు అలాగే ఉంచిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ చిట్కాను 10 నుండి 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే జిల్లేడు ఆకులను సేకరించి వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత వాటికి ఆముదం నూనెను లేదా ఆవనూనెను రాసి వేడి చేయాలి. తరువాత ఈ ఆకులను నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. అదే విధంగా జిల్లేడు ఆకులను తుంచగా వచ్చిన పాలను సేకరించాలి.
తరువాత ఈ పాలను కీళ్లు నొప్పులు ఉన్న చోట రాసి 3 నుండి 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేసిన తరువాత ఆవ నూనె రాసి వేడి చేసిన జిల్లేడు ఆకులను ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా నొప్పులు తగ్గి మనకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. జిల్లేడు ఆకులను ఈ విధంగా ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, పాదాల నొప్పులు, మడమ నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ జిల్లేడు ఆకులను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణీలు, బాలింతలు ఈ చిట్కాలను పాటించకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.