Cancer Symptoms : క్యాన్సర్…ఈ పేరు వింటేనే మనకు భయం కలుగుతుంది. ప్రాణాంతకమైన వ్యాధుల్లో ఇది ఒకటి. మారిన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే కొందరిలో జన్యుపరంగా కూడా ఈ వ్యాధి వ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధికి ఖచ్చితమైన మందులు అంటులేవు. రేడియేషన్, కీమో థెరపీ వంటి పద్దతులను అనుసరించి క్యాన్సర్ కణాలను నశింపజేయవచ్చు. తద్వారా క్యాన్సర్ ఒక శరీర భాగం నుండి మరో శరీర భాగానికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడు గుర్తించినట్టయితే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది. క్యాన్సర్ వచ్చే ముందు మన శరీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో ముందే తెలుసుకుంటే క్యాన్సర్ వ్యాధిని మనం త్వరగా గుర్తించవచ్చు.
క్యాన్సర్ బారిన పడే ముందు మన శరీరంలో చోటు మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు. కొన్ని లక్షణాల ద్వారా మనం క్యాన్సర్ గుర్తించవచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. క్యాన్సర్ వచ్చే ముందు శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి లేకుండా కణతులు ఏర్పడడం జరుగుతుంది. అలాగే చర్మం మచ్చలు ఏర్పడి వాటిలో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ మచ్చలు పగలడం, పుండులా మారడం వంటివి జరుగుతాయి. ఇవి చాలా కాలం వరకు మానకుండా నొప్పి లేకుండా ఉంటాయి.
అలాగే ఒక వయసు దాటిన తరువాత అనగా 45 సంవత్సరాలు దాటిన తరువాత కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కూడా క్యాన్సర్ రావడానికి ముందు మనలో కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా కాలంగా దగ్గు రావడం, దగ్గు తీవ్రత పెరగడం, దగ్గినప్పుడు రక్తం రావడం, మల విసర్జన, మూత్రవిసర్జనలో రక్తం పడడం వంటి వాటిని క్యాన్సర్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ రాకపోవచ్చని వారు చెబుతున్నారు. క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడు ఎటువంటి నొప్పి, బాధ ఉండదని దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల అది మరింత ముదిరి ప్రాణాపాయంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ లక్షణాలను కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన వారు సంవత్సరానికి ఒకసారి క్యాన్సర్ కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా మనం క్యాన్సర్ ను ముందే గుర్తించవచ్చు. జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని భావించే వారు ఇలా సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.