Vavinta Mokka Benefits : మనకు రోడ్ల పక్కన అనేక రకాల మొక్కలు కనబడుతూ ఉంటాయి. ఇలా రోడ్ల పక్కన కనిపించే అనేక రకాల మొక్కల్లో పచ్చ వాయింట మొక్క కూడా ఒకటి. దీనికి వావింట, వామింటనే పేర్లు కూడా కలవు. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ మొక్క ఆకులను కూరగా వండుకుని తినే వారు. దీనిని సంస్కృతంలో బర్బరీ, అజగంధ అని హిందీలో తిలవన్ పిలుస్తారు. వావింట మొక్కకు సన్నటి కాయలు కూడా ఉంటాయి. వీటి గింజలు చూడడానికి ఆవ గింజల్లగా ఉంటాయి. ఈ మొక్క సమూల చూర్ణం కారం రుచిని కలిగి ఉంటుంది. వావింట మొక్కను ఉపయోగించి మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.
పక్షవాతాన్ని, గుండెసంబంధిత సమస్యలను, కఫ రోగాలను, చెవి రోగాలను, క్రిమి రోగాలను నయం చేయడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చలిగాలిలో పని చేసినప్పుడు చాలా మందిలో తల నిండా కఫం చేరి తలనొప్పి వస్తూ ఉంటుంది. ముక్కు నుండి, కళ్ల నుండి నీరు కారుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ వావింట ఆకును మెత్తగా నూరి బిళ్ల లాగా చేసి మాడుపై పెట్టి కట్టు కట్టాలి. ఇలా ఉంచిన కొద్ది సమయం తరువాత తలపై వేడిగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఆకు ముద్దను తీసి దాని నుండి నీరు పిండాలి. మరలా ఈ ముద్దను మాడుపై ఉంచాలి. వేడిగా అనిపించగానే నీటిని పిండి మరలా మాడుపై ఉంచాలి. ఇలా రెండు నుండి మూడు సార్లు చేయాలి. వేడిగా అనిపించిన తరువాత కూడా ఆకును అలాగే ఉంచితే తలపై పుండు పుడుతుంది. కనుక వేడిగా అనిపించగానే ఆకు ముద్దను తీసివేయాలి.
ఇలా రెండు, మూడు రోజులు చేయడం వల్ల తలభారం, తలపోటు తగ్గిపోతాయి. చర్మ సంబంధిత సమస్యలను నయం చేసే గుణం కూడా ఈ మొక్కకు ఉంది. వావింట మొక్కను సమూలంగా సేకరించి ముక్కలుగా చేసి దంచుకుని దాని నుండి రసం తీయాలి. ఈ రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి నూనె మిగిలే చిన్న మంటపై వేడి చేయాలి. తరువాత ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను గోరు వెచ్చగా చేసి చర్మ సమస్యలు ఉన్న చోట రెండు పూటలా రాస్తూ ఉంటే గజ్జి, తామర, దురద వంటి అనేక చర్మ రోగాలు తగ్గుతాయి. చెవి నొప్పితో బాధపడే వారు ఈ వావింట మొక్క ఆకుల రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల చొప్పున చెవిలో వేసుకోవడం వల్ల చెవినొప్పి తగ్గుతుంది. వావింటాకును, ఉప్పును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని దురద ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వల్ల దురద వెంటనే తగ్గుతుంది. దురద తగ్గగానే నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి గడ్డలపై ఉంచి కట్టు కట్టాలి. మంట పుట్టిన మరుక్షణమే తీసి వేయాలి. దీని వల్ల మొండి గడ్డలు అతి త్వరగా పక్వమయ్యి పగిలి నొప్పి తగ్గుతుంది. పరిశుభ్రమైన ప్రాంతంలో పెరుగుతున్న వావింట మొక్క ఆకులను సేకరించి పప్పు కూరగా, పులుసు కూరగా, వేపుడుగా వండుకుని కొద్దిగా అన్నంతో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు, కఫ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. వావింట మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.