Milk Mysore Pak Recipe : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మిల్క్ మైసూర్ పాక్ కూడా ఒకటి. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ మైసూర్ పాక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మైసూర్ పాక్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మిల్క్ పౌడర్ – 200 గ్రా., మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 250 గ్రా., పంచదార – 800 గ్రా., నీళ్లు – 200 ఎమ్ ఎల్, నిమ్మరసం – పావు టీ స్పూన్.
మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మిల్క్ పౌడర్, మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత ఒక గిన్నెకు నెయ్యిని రాసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార తీగ పాకం వచ్చిన తరువాత నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ ను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత ఒక్కో గంటె నెయ్యిని వేస్తూ కలుపుకోవాలి. నెయ్యిని పంచదార మిశ్రమం పీల్చుకున్న తరువాత మరో గంటె నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇలా 200 గ్రాముల నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఈ మైసూర్ పాక్ ను కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంది. ఈ మైసూర్ పాక్ తయారవ్వడానికి 25 నిమిషాల సమయం పడుతుంది. 25 నిమిషాల తరువాత మైసూర్ పాక్ రంగు మారడాన్ని మనం గమనించవచ్చు.
ఇప్పుడు కొద్దిగా మైసూర్ పాక్ మిశ్రమాన్ని తీసుకుని ఉండగా చేసుకోవాలి. ఉండగా చేయడానికి వస్తే మైసూర్ పాక్ తయారయ్యిందిగా భావించ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఉండగా చేయడానికి రాకపోతే మరికొద్ది సేపు కలుపుతూ ఉడికించాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తరువాత మిగిలిన నెయ్యిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. దీనిని 4 గంటల పాటు లేదా ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత మైసూర్ పాక్ ను ప్లేట్ లోకి తీసుకుని కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్క్ మైసూర్ పాక్ తయారవుతుంది. ఒకవేళ మైసూర్ పాక్ మిశ్రమం ముక్కలు చేయడానికి రాకపోతే పంచదార మిశ్రమం ముదురు పాకం రాలేదని భావించాలి. ఈ విధంగా చేయడం వల్ల అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే మిల్క్ మైసూర్ పాక్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.