Madatha Kaja Recipe : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో మడత కాజా కూడా ఒకటి. దీని రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తీపిని ఇష్టపడే వారు వీటిని మరింత ఇష్టంగా తింటారు. మడత కాజాలను ఇంట్లో తయారు చేసుకోలేమని చాలా మంది భావిస్తారు. కానీ అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ మడత కాజాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మడత కాజాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మడత కాజా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 250 గ్రా., కరిగించిన డాల్డా – 4 టీ స్పూన్స్, వంటసోడా – పావు టీ స్పూన్, పంచదార – అర కిలో, నీళ్లు – 150 ఎమ్ ఎల్, పటిక – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మడతకాజా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత అందులో కరిగించిన డాల్డా, వంటసోడా వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని 4 నుండి 5 నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిపై తడి వస్త్రాన్ని వేసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత కళాయిలో పంచదార , నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి ఒక పొంగు వచ్చిన తరువాత పటిక వేసి కలుపుకోవాలి. దీనిని లేత తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండిని మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చతురస్రాకారంలో చపాతీలా రుద్దుకోవాలి. చతురస్రాకారంలో రుద్దుకోవడం రాని వారు చపాతీలా రుద్దిన తరువాత అంచులను కట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిపై 3 టేబుల్ స్పూన్ల కరిగించిన డాల్డాను వేసి చపాతీ అంతా వచ్చేలా రాయాలి. తరువాత దీనిపై పొడి మైదా పిండిని చల్లాలి. ఇప్పుడు ఒక చివరి నుండి మొదలు పెట్టి గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తరువాత అర ఇంచు మందంతో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముక్కను తీసుకుని వేలితో కాజా ఆకారంలో వత్తిన తరువాత చపాతీ కర్రతో మరోసారి వత్తి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తయారు చేసుకున్న కాజాలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అర నిమిషం తరువాత కాజాలు కొద్దిగా వేగి పైకి తేలుతాయి. కాజాలు పైకి తేలిన తరువాత మరలా స్టవ్ ఆన్ చేసి వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ముందుగా తయారు చేసిన పాకంలో వేసుకోవాలి.
వీటిని అర నిమిషం పాటు పాకంలో ఉంచిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే కాజాలు తయారవుతాయి. వీటిని తయారు చేసేటప్పుడు పంచదార పాకం ముదరకుండా ఉండాలి. అప్పుడే మనకు చక్కటి మడత కాజాలు తయారవుతాయి. అలాగే ఇందులో వాడిన పటిక మన ఆయుర్వేద షాపుల్లో లభ్యమవుతుంది. ప్రతేక రోజులప్పుడు, పండుగలకు బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా మడత కాజాలను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.