Dark Armpits Remedy : మనలో చాలా మంది చంక భాగంలో నల్లటి చర్మాన్ని కలిగి ఉంటారు. బాహూ మూలల్లో చర్మం నల్లగా మారడం అనేది చాలా సహజం. చంక భాగంలో తరచూ షేవింగ్ చేయడం వల్ల అలాగే ఆయా భాగాల్లో గాలి సరిగ్గా ఆడక చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్య కారణంగా చాలా మంది వారికి నచ్చిన దుస్తులను ధరించలేకపోతుంటారు. ఇంటి చిట్కాను ఉపయోగించి చంక భాగంలో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల చంక భాగంలో చర్మం తెల్లగా మారడంతో పాటు దుర్వాసన రావడం కూడా తగ్గుతుంది. చంక భాగంలో చర్మం పై ఉండే నలుపును తొలగించే ఈ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కా కోసం మనం పెట్రోలియం జెల్లీని, పసుపును, నిమ్మరసాన్ని, వంటసోడాను ఉపయోగించాల్సి ఉంటుంది. చంక భాగంలో చర్మం పొడి బారడం వల్ల కూడా నలుపుగా అవుతుంది. పెట్రోలియం జెల్లీని వాడడం వల్ల చర్మానికి తగినంత తేమ లభించడంతో పాటు చర్మ కణాలు పాడవకుండా ఉంటాయి. పసుపును వాడడం వల్ల చర్మం లోతుగా శుభ్రపడడంతో పాటు చర్మం పై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. ఇక నిమ్మరసం మన చర్మానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. నిమ్మరసాన్ని వాడడం వల్ల చర్మంపై ఉండే నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుంది. మన చర్మాన్ని శుభ్రపరచడంలో వంటసోడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ ప్రదేశంలో ఉండే బ్యాక్టీరియాను నశింపజేసి దుర్వాసన రాకుండా చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పెట్రోలియం జెల్లీని తీసుకోవాలి. పెట్రోలియం జెల్లీ అందుబాటులో లేని వారు దాని స్థానంలో తేనెను కూడా ఉపయోగించవచ్చు. తరువాత ఈ జెల్లీలో ఒక టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. తరువాత ఇందులో 5 చుక్కల నిమ్మరసాన్ని, వంటసోడాను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించే ముందు చంక భాగాన్ని శుభ్రపరుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చంక భాగంలో రాసి 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఈ చిట్కాను పాటించడం వల్ల చంక భాగంలో నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని కేవలం చంక భాగంలోనే కాకుండా మోచేతులు, మోకాళ్లు వంటి ఇతర భాగాలపై కూడా ఉపయోగించవచ్చు.