Constipation Home Remedy : నేటి ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సంబంధిత సమస్యల్లో మలబద్దకం ఒకటి. ఈ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ కు అలవాటు పడి పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, నీటిని తక్కవగా తాగడం వంటి అనేక కారణాల చేత ఈ సమస్య బారిన పడుతున్నారు. మలబద్దకం సమస్య వల్ల గ్యాస్, అసిడిటి, ఆకలి వేయకపోవడం, ఫైల్స్, పిషర్స్, తలనొప్పి వంటి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేస్తూ కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుండి మనం సులభంగా బయట పడవచ్చు.
మలబద్దకాన్ని తగ్గించడంలో త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. రాత్రి పూట దీనిని మజ్జిగలో కానీ, నీటిలో కానీ కలిపి తీసుకోవడం వల్ల ఉదయాన్నే సాఫీగా విరేచనం అవుతుంది. నాలుగు సంవత్సరాల పైబడిన పిల్లల నుండి దీనిని ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా మూడు నెలల పాటు వాడిన తరువాత 20 రోజుల పాటు విరామం ఇవ్వాలి. ఇలా విరామం ఇచ్చిన 20 రోజుల తరువాత దీనిని వాడడం మరలా ప్రారంభించాలి. ఈ విధంగా త్రిఫలా చూర్ణాన్ని వాడడం వల్ల మలబద్దకం సమస్య నుండి చాలా సలుభంగా బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా త్రిఫల చూర్ణాన్ని వాడడంతో పాటు అరటి, ఫైనాఫిల్, సపోటా, నారింజ వంటి పండ్లను తీసుకోవాలి.
అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలను, ఆకుకూరలను నిత్యం తీసుకోవాలి. మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. నిల్వ ఉంచిన పచ్చళ్లలను తీసుకోవడం కాఫీ, టీ లను తాగడం తగ్గించాలి. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మలం మృదువుగా తయారవుతుంది. చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అలాగే వ్యాయామం కూడా ప్రతిరోజూ చేస్తూ ఉండాలి. అలాగే ఉదయం పూట ఒక గ్లాస్ నీటిని తాగి అటూ ఇటూ తిరగాలి. ఇలా చేయడం వల్ల పొట్టలో కదలికలు పెరుగుతాయి. ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మలబద్దకం సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చు.