Street Style Egg Noodles : మనకు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభిఒంచే వాటిల్లో నూడుల్స్ ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. ఈ నూడుల్స్ లో కూడా మనకు వివిధ రుచుల్లో లభ్యమవుతూ ఉంటాయి. వాటిల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒకటి. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ నూడుల్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎగ్ నూడుల్స్ రుచిగా, సులభంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూడుల్స్ – 100 గ్రా., నూనె – పావు కప్పు, కోడిగుడ్లు – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, క్యాబేజ్ తురుము – పావు కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ – 1, సన్నగా పొడుగ్గా తరిగిన క్యాప్సికం – 1, సోయా సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, అజినమోటో – చిటికెడు, తరిగిన ఉల్లికాడలు – కొద్దిగా.

స్ట్రీట్ స్టైల్ నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని వేడి చేయాలి. ఇందులో ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక నూడుల్స్ ను మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత నూడుల్స్ ను ఒక .ల్లి గిన్నెలోకి తీసుకుని చల్లటి నీటితో కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లను బాగా బీట్ చేసుకుని ఆమ్లెట్ లా వేసుకోవాలి. ఇది ఒకవైపు కాలిన తరువాత మరోవైపుకు తిప్పి కాల్చుకోవాలి. తరువాత ఈ ఆమ్లెట్ ను పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ తురుము, క్యాప్సికం వేసి రెండు నిమిషాల పాటు పెద్ద మంటపై టాస్ చేసుకోవాలి.
తరువాత ఉడికించిన నూడుల్స్ ను వేసి వేసుకోవాలి. ఇందులోనే ఉల్లికాడలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలిపిన తరువాత చివరగా ఉల్లికాడలు చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నూడుల్స్ తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా అప్పుడప్పుడు ఇలా నూడుల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.