Crispy Aloo Fry : బంగాళాదుంపలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలను తీసుకోవడ వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బంగాళాదుంపలతో ఎక్కువగా చేసే వంటకాల్లో ఫ్రై ఒకటి. బంగాళాదుంప ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంప ఫ్రై ను మరింత రుచిగా క్రిస్పీ గా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – అర కిలో, నూనె – అర కప్పు, మెంతులు – అర టీ స్పూన్, ఎండుమిర్చి -3, మెంతి కట్టలు – 2 ( చిన్నవి), ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలు వేసి కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను ఉంచి మిగిలిన నూనెను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత మెంతి కట్టలను తరిగి వేసుకోవాలి. ఈ మెంతి ఆకులను మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మెంతి ఆకులు వేగిన తరువాత వేయించిన బంగాళాదుంపలు వేసి కలపాలి. తరువాత ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి 5 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఫ్రైను గిన్నెలోకి తీసుకున్న తరువాత దానిపై మూతను ఉంచకూడదు. మూతను పెడితే ఆలూ మెత్తగా అవుతుంది. మూతకు బదులుగా కాటన్ వస్త్రాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల చేదు చేదుగా రుచిగా ఉండే ఆలూ ఫ్రై తయారవుతుంది. దీనిని నెయ్యి, అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే ఆలూ ఫ్రై కంటే ఈ విధంగా మెంతికూరను వేసి చేసే ఆలూ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది.