Ragi Walnut Laddu : రాగులు మన శరీరానికి ఎంతటి మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో మనకు కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. రాగులు మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. కనుకనే వేసవిలో రాగులతో చేసే ఆహారాలను తీసుకుంటుంటారు. ముఖ్యంగా రాగి జావ, రాగి సంకటి వంటివి తింటారు. అయితే రాగులను కేవలం వేసవిలోనే కాదు.. ఏ సీజన్‌లో తీసుకున్నా సరే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అయితే రాగులను, వాల్ నట్స్‌ను కలిపి లడ్డూలను కూడా చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా సులభమే. ఇవి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగులు వాల్ నట్స్ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
వాల్ నట్స్, బెల్లం తరుగు – ముప్పావు కప్పు చొప్పున, నెయ్యి – పెద్ద టీస్పూన్, రాగి పిండి – ఒకటిన్నర కప్పులు, యాలకుల పొడి – అర టీస్పూన్.
రాగులు వాల్ నట్స్ లడ్డూలను తయారు చేసే విధానం..
స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక చిన్న మంటపై రాగి పిండి వేసి వేయించాలి. మరో స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టి కొన్ని నీళ్లు పోసి బెల్లం వేసి బాగా కలపాలి. లేత పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు వాల్ నట్స్‌ను వేరొక పాన్‌లో వేసి కాసేపు వేయించి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పెద్ద గిన్నెలో వాల్ నట్స్ ముక్కలు, రాగి పిండి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని పోసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుని ఈ పిండిని చేతిలోకి తీసుకుని లడ్డూల్లా చుట్టాలి. దీంతో ఎంతో రుచికరమైన రాగులు వాల్ నట్స్ లడ్డూలు తయారవుతాయి.
ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. ఎంతో బలం కూడా. ఇవి మనకు పోషకాలను, శక్తిని అందిస్తాయి. వీటిని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ తినవచ్చు. ఎంతో ఇష్టంగా తింటారు. రోజుకు ఒకటి తింటే ఎన్నో పోషకాలు లభించడంతోపాటు శక్తి కూడా అందుతుంది. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.