Paneer Dum Biryani : పాల నుండి తయారు చేసే పన్నీర్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పన్నీర్ ను తీసుకోవడం వల్ల కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పన్నీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పన్నీర్ తో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. పన్నీర్ తో చేసుకోదగిన వంటకాల్లో బిర్యానీ కూడా ఒకటి. పన్నీర్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చక్కగా వండాలే కానీ నాన్ వెజ్ బిర్యానీకి ఇది ఏమాత్రం తక్కువ కాదు. ఈ పన్నీర్ బిర్యానీని హైదరాబాదీ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ పన్నీర్ ధమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పన్నీర్ ముక్కలు – 300 గ్రా., తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, లవంగాలు – 4, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒకటేబుల్ స్పూన్ లేదా తగినంత, నిమ్మకాయ రసం – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 250 గ్రా..
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర లీటర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 6, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 6, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, నల్ల యాలకులు – 2, అనాస పువ్వు – 2.
హైదరాబాదీ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా అడుగు భాగం మందంగా ఉండే కళాయిని తీసుకోవాలి. అందులో పెరుగు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. తరువాత ఇవి అన్నీ కూడా పన్నీర్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత పెరుగు వేసి కలిపి కళాయి అంతా సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు లీటర్ల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీటిని మరిగించాలి. నీరు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడికించాలి. బియ్యం 80 శాతం ఉడికిన తరువాత వీటిని జల్లిగంటెతో తీసుకుంటూ నీళ్లు పోయిన తరువాత ముందుగా తయారు చేసిన పన్నీర్ మిశ్రమం మీద అంతా సమానంగా వేసుకోవాలి. ఇలా అన్నం వేసుకున్న తరువాత దీనిపై పావు కప్పు నెయ్యిని, రెండు టేబుల్ స్పూన్ల వేయించిన ఉల్లిపాయలను, పావు టీస్పూన్ గరం మసాలాను, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను, చిటికెడు కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసుకోవాలి.
తరువాత దీనిపై రెండు టిష్యూపేపర్ లను ఉంచి ఆవిరి బయటకు పోకుండా మూతను ఉంచాలి. తరువాత ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ పన్నీర్ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని మిర్చి కా సాలన్, రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, ప్రత్యేక సందర్భాల్లో ఇలా పన్నీర్ తో బిర్యానీని చేసుకుని తినవచ్చు.